‘మగధీర’ సినిమా చూపించాడు | Sakshi
Sakshi News home page

‘మగధీర’ సినిమా చూపించాడు

Published Thu, Mar 8 2018 8:20 AM

Exorcist Arrest In Cheating Case - Sakshi

చాంద్రాయణగుట్ట: మానవతీత శక్తుల పేరుతో అమాయకులను బురిడి కొట్టించి కోట్లాది రూపాయలు కాజేసిన ఘరానా మోసగాడిని మీర్‌చౌక్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్‌ గోల్డెన్‌ కాలనీకి చెందిన మెహతాబ్‌ హుస్సేన్‌ అలియాస్‌ ఆదిల్, అతని మూడో భార్య సకీనా ఫాతీమా ఫర్నీచర్‌ వ్యాపారం చేసేవారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు భూత వైద్యుడి అవతారం ఎత్తిన అతడికి ఆజం అనే వ్యక్తి ద్వారా యాకుత్‌పురాకు చెందిన వ్యాపారి రుస్తుం పటేల్‌తో పరిచయం ఏర్పడింది. తనకు దివ్యదృష్టి ఉందని, ఆసిఫ్‌జాహి, టిప్పు సుల్తాన్, కుతుబ్‌షాహిల కాలంలో దాచిన గుప్త నిధుల వివరాలు చెబుతానంటూ నమ్మించాడు.

కర్ణాటక, మైసూర్‌ ప్రాంతాలకు తీసుకెళ్లిన అతను వాస్తు దోషాల కారణంగా నిధి బయటికి రావడం లేదని నమ్మించాడు. ఇంతటితో ఆగకుండా మీరు 4000 ఏళ్ల క్రితం గొప్ప రాజు అని, అప్పట్లో మీ భార్యగా ఉన్న మహిళ కూడా మళ్లీ జన్మించిందని.....ఆమె ప్రస్తుతం వేల కోట్లకు అధిపతిగా ఉందని చెబుతూ ఓ మహిళ ఫొటో, హిందీలో రాసిన లవ్‌ లెటర్‌ను కూడా చూపించాడు. ఆమెతో పెళ్లి జరిపించి కోటీశ్వరుడిని చేస్తానని నమ్మించాడు. అంతేగాకుండా తన వద్ద ఉన్న రైస్‌ ఫుల్లింగ్‌ యంత్రం ద్వారా రూ.కోట్లు సంపాదించవచ్చని చెప్పి దాదాపు రూ.3 కోట్లు వసూలు చేశాడు. మరి కొందరినుంచి కూడా భారీగా వసూలు చేశాడు. ఈ డబ్బుతో చిన్న గోల్కొండ ప్రాంతంలో 2000 గజాల స్థలం, చింతల్‌మెట్‌లో ఓ భవనాన్ని నిర్మించడంతో పాటు పలుమార్లు విదేశీ పర్యటనలు చేశాడు.

కొంతకాలానికి అతడిపై అనుమానం వచ్చిన రుస్తుం పటేల్‌ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మెహతాబ్‌ అతడిని ఎయిర్‌ పిస్తోల్‌తో బెదిరించాడు. అయినా బాధితుడు ఒత్తిడి చేయడంతో రూ.8.5 లక్షలు హబీబ్‌నగర్‌ రౌడీషీటర్‌ మహ్మద్‌ యూసుఫ్‌ అలియాస్‌ జంగ్లీ యూసుఫ్‌ ద్వారా ఇచ్చి పంపాడు. అయితే ఆ డబ్బులను యూసుఫ్‌ బాధితుడికి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నాడు. దీంతో గత నెల 24న బాధితుడు మీర్‌చౌక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.13.5 లక్షల నగదు, ఎయిర్‌ పిస్తోల్, రెండు పాస్‌ పోర్టులు, ఐదు గ్రాముల బంగారం, రైస్‌ ఫుల్లింగ్‌ సామాగ్రి  స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement