అన్నదాత ఉసురు తీసిన అప్పులు | Sakshi
Sakshi News home page

అన్నదాత ఉసురు తీసిన అప్పులు

Published Thu, Apr 19 2018 5:59 PM

Farmer And Two Men Commits Suicide - Sakshi

అన్నం పెట్టే అన్నదాతే అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గల్ఫ్‌ దేశానికి వెళ్లినా కలిసి రాలేదు. పుడమి తల్లినే నమ్ముకున్న ఆయనకు ఎక్కడా సహకరించక బలన్మరణానికి ఒడిగట్టాడు. చివర కు తన కుటుంబాన్ని విషాదంలోకి నింపి వెళ్లాడు.

ధర్పల్లి(నిజామాబాద్‌ రూరల్‌): నమ్ముకున్న భూమిపై పెట్టి పంటల సాగుపై చేసిన అప్పులు పెరిగి పోవటంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయిన రైతు తన పొలంలోనే మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ పూర్ణేశ్వర్‌ వివరాలు తెలిపారు. మండలంలోని దుబ్బాకకు చెందిన సదు బక్కన్న(61) అనే రైతు పంటల సాగు కోసం చేసిన అప్పులు పెరిగి బుధవారం ఉదయం బలన్మరణానికి పాల్పడ్డాడు. 10 ఎకరాల సాగుభూమిలోని పంటల సాగు కోసం ఆరు బోర్లు వేసి నీళ్లు పడక పోవటంతో అప్పులు చేశాడు. దీంతో అప్పులు సుమారు రూ.25 నుంచి 30లక్షల వరకు పెరిగి 5 ఎకరాల సాగుభూమిని ఇటీవలే అమ్మివేశాడు. అయినా అప్పులు తీరడం లేదని కొన్ని రోజులుగా మదనపడ్డాడు.

రోజు సదు బక్కన్న ఉపాధిహామీ పథకం కింద కూలీగా పని చేస్తున్నాడు. బుధవారం ఇంట్లో నుంచి కూలి పనులకు వెళ్లుతున్నానని వెళ్లి నేరుగా సొంత పొలంలోకి వెళ్లి చెట్టుకు వైరుతో ఉరేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్‌ రమేశ్, ఎస్‌ఐ పూర్ణేశ్వర్‌ వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా కేంద్ర అస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయంపై చేసిన అప్పులు తీరక కుటుంబ పెద్ద కానరాని లోకాలకు వెళ్లాడని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

జీవితంపైవిరక్తి చెంది ఒకరు...
పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌లో తోకల మురుగేశ్‌ అలియాస్‌ దండుగుల మురుగేశ్‌(30) అనే వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంకాపూర్‌కు చెందిన మురుగేశ్‌ కూలీగా పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా పనికి వెళ్లకుండా తాగుడుకు బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంట్లో రేకుల షెడ్డుకు గల పైపునకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. ఎస్‌ఐ గోపి సంఘటన స్థలానికి చేరు కుని ఘటనపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

ఓ విద్యార్థి కూడా..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలం లోని చిట్యాల గ్రామానికి చెందిన మంగళి శ్రీనాథ్‌(11) అనే విద్యార్థి బుధవారం ఉరేసుకొని ఆత్మహ త్య చేసుకున్నట్లు ఎస్‌ఐ అంజయ్య తెలిపారు. మంగళి భీమయ్య కుమారుడైన శ్రీనాథ్‌ గ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. శ్రీనాథ్‌కు తరుచూ మూత్రం వస్తుండడంతో వైద్యచికిత్సలు చేయించారు. శస్త్రచికిత్సలు చేయించినా మూత్రం నెమ్మదిగా వచ్చేదన్నారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన విద్యార్థి తన కుటుంబీకులు ఉపాధిహామీ పనులకు వెళ్లాక ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు.

Advertisement
Advertisement