మరో వివాదంలో మాజీ ఏఎస్‌ఐ | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో మాజీ ఏఎస్‌ఐ

Published Fri, Jan 5 2018 2:04 AM

former ASI In another controversy  - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌ క్రైం: మాజీ ఏఎస్‌ఐ బొబ్బల మోహన్‌రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదైంది. కరీంనగర్‌కు చెందిన పోతర్ల గట్టయ్య అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్‌ గురువారం కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయనపై 50 పైగా కేసులు నమోదు కాగా, సగం కేసులపై చార్జీషీట్లు దాఖలయ్యాయి.

డబ్బులు కట్టే వరకు తన తల్లి కర్మకాండలకు మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి హాజరు కానివ్వలేదని కరీంనగర్‌ కోతిరాంపూర్‌కు చెందిన పోతర్ల గట్టయ్య ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 8–7–166 నంబరు గల ఆర్‌సీసీ బిల్డింగ్‌ను మోహన్‌రెడ్డికి చెందిన ప్రైవేటు ఫైనాన్స్‌లో తనఖా పెట్టి అప్పు తీసుకుంటే.. వడ్డీ పెరిగిందని ఇతర ఆస్తులను కూడా తాకట్టు పెట్టుకున్నాడని.. చివరికి తన బినామీల పేరుమీద బలవంతంగా కరీంనగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జీపీఏ రిజిస్ట్రేషన్‌కు బదులు 1608/2013 ప్రకారం సేల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడని ఆరోపించారు.

అంతడితో ఆగకుండా ఆయన అనుచరుడైన పర్మిందర్‌సింగ్‌ను ఇంటికి పంపించి బలవంతంగా బోయవాడలోని తన ప్రైవేట్‌ ఫైనాన్స్‌కు పిలిపించి వడ్డీ డబ్బులు కట్టాలని నిర్బంధించారని గట్టయ్య తెలిపారు. ‘ఇంటి వద్ద నా తల్లి కర్మకాండలు నిర్వహించాల్సి ఉంది..తర్వాత వస్తాను..’అన్న కూడా వినకుండా ‘వడ్డీ డబ్బులు కట్టి కర్మకాండ జరుపుకో’అని ఆయన అకౌంటెంట్‌ జ్ఞానేశ్వర్‌ సమక్షంలో బెదిరించాడని, చేసేది లేక తన కొడుకు పోతర్ల పూర్నేశ్‌ అప్పు తెచ్చి తను విడిపించుకెళ్లాడని గట్టయ్య పేర్కొన్నారు.  

Advertisement
Advertisement