నిర్లక్ష్యం ఖరీదు నలుగురి ప్రాణాలు | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం ఖరీదు నలుగురి ప్రాణాలు

Published Fri, Feb 16 2018 1:50 PM

four dead in lorry accident - Sakshi

గిద్దలూరు: డ్రైవర్‌ నిర్లక్ష్యంగా తన సెల్‌కు రీచార్జి పెట్టుకుంటుండగా లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడంతో పాటు 41 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొమరోలు మండలం నల్లగుంట్ల సమీపంలో తంబళ్లపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం చిక్‌బల్లాపూర్‌ జిల్లాకు చెందిన సాథిలి, దేవగానిపల్లి, ఉప్పకుంటహల్లి గ్రామాల భక్తులు శివరాత్రి సందర్భంగా పలు ఆలయాలు దర్శించుకునేందుకు ఈ నెల 11వ తేదీన ఓ ట్రావెల్స్‌ నిర్వాహకుడి లారీలో బయల్దేరారు. కదిరి, తుమ్మలకొండ కోన, బ్రహ్మంగారి మఠం ఆలయాలు దర్శించుకుని శ్రీశైలం వెళ్తున్నారు.

మార్గమధ్యంలో నల్లగుంట్ల సమీప  మలుపు వద్ద డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ఉండటంతో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ రాళ్లను ఢీకొంటూ వెళ్లి బోల్తా పడింది. 61 మంది ఉండటంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరగడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా 41 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీలో 10 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. మృతుల్లో సాథిలి గ్రామానికి చెందిన నల్లవోలు నారాయణమ్మ (48), తలారి నారాయణప్ప ఆదెమ్మ (58), దేవగానిపల్లెకు చెందిన వెంకట నరసయ్యప్ప (50), ఉప్పుకుంటహల్లికి చెందిన జూలెపల్లి మారప్ప (60) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో నరహల్ల మనిరత్నమ్మ, బి.జయమ్మ, పాపన్న అనసూయమ్మ, నాగరాజప్ప, తిప్పన్న, బాబన్నగారి మునికృష్ణ, కదిరపు రఘు ఉన్నారు.

పోలీసుల సేవలు భేష్‌
అర్ధరాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించారు. కొమరోలు ఎస్‌ఐ అబ్దుల్‌ రహమాన్‌ తక్షణమే సీఐ శ్రీరామ్‌కు విషయం చేరవేశాడు. ఆయన గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట ఎస్‌ఐలతో పాటు సిబ్బందిని పిలిపించి సంఘటన స్థలంలోని క్షతగాత్రులను తమ వాహనాల్లోనే గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో చికిత్స అందింపజేశారు. అక్కడికక్కడే మృతి చెందిన నలుగురు మినహా గాయపడిన అందరనీ సకాలంలో ఆస్పత్రికి తరలించారు. క్యాబిన్‌లో ఇరుక్కున్న భక్తులను చాకచక్యంగా బయటకు తీసి వారికి ఎలాంటి గాయాలు కాకుండా కాపాడటంతో స్థానికులు పోలీసులను అభినందించారు.

స్వగ్రామాలకు క్షతగాత్రులు
నల్లగుంట్ల వద్ద జరిగిన రోడు ప్రమాదంలో గాయాలపాలైన వారికి చికిత్స అందించిన అనంతం స్వగ్రామాలకు చేర్చేందుకు పోలీసులు చొరవ తీసుకున్నారు. ఎస్పీ సత్యేసుబాబు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసి స్వల్పగాయాలైన వారిని, వారి బంధువులను ఎక్కించారు. మృతులకు ప్రత్యేకంగా అంబులెన్స్, తీవ్రంగా గాయపడిన వారిలో కొందరికి ఒక అంబులెన్స్‌ చొప్పున కేటాయించి వారి వారి గ్రామాలకు చేర్చేలా పోలీసు సిబ్బందిని పంపించారు.

కేసు నమోదు
డ్రైవర్, లారీ యజమానికిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లారీ అనంతపురం జిల్లా లేపాక్షికి చెందినదిగా గుర్తిం చామని చెప్పారు. టూరిస్టు నిర్వాహకుడు సహదేవప్పపైనా కేసు నమోదు చేశామన్నారు. వీరంతా సహదేవప్పకు రూ.1,500 చొప్పున చెల్లించి దైవ దర్శనం కోసం వచ్చారని తెలిపారు. క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిఫిన్, భోజనం ఏర్పాటు చేశామని వివరించారు. ఆయనతో పాటు సీఐ వి.శ్రీరామ్, ఎస్‌ఐలు కె.మల్లికార్జున, షేక్‌ అబ్ధుల్‌రహమాన్, శశికుమార్, నాగశ్రీను ఉన్నారు.

జిల్లా అధికారులకు కృతజ్ఞతలు
ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో సపర్యలు చేసి ఓదార్చి ధైర్యం చెప్పిన జిల్లా అధికారులను కర్ణాటకలోని గుడిబండ తాలూకా పంచాయతీ అధ్యక్షుడు రామాంజి అభినందించారు. ప్రమాదంలో మృతి చెందిన ఆదెమ్మ తన అత్త అని, సమాచారం తెలియగానే తాను గిద్దలూరు వచ్చానని, ఇక్కడ తమ ప్రాంతానికి చెందిన క్షతగాత్రులకు పోలీసులు, వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement