సుపారీగ్యాంగ్‌ సభ్యుల అరెస్టు | Sakshi
Sakshi News home page

సుపారీగ్యాంగ్‌ సభ్యుల అరెస్టు

Published Fri, Jul 13 2018 10:34 AM

Gang Members Artist In Karimnagar - Sakshi

కోరుట్ల:  భూవివాదంలో ఒకరి హత్యకు పాల్పడ్డ సుపారీగ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ఇద్దరి సభ్యులను గురువారం అరెస్టు చేశామని, ముఠాలీడర్‌ అజీజ్‌ కోసం గాలింపు చేపట్టినట్లు కోరుట్ల సీఐ సతీశ్‌చందర్‌రావు తెలిపారు. కోరుట్ల మండలం గుమ్లాపూర్‌లో ఏడాది క్రితం రాజ్‌మహ్మద్‌కు అతని సోదరులతో భూవివాదం నెలకొంది. ఈక్రమంలో రాజ్‌మహ్మద్‌ అన్న రహీమ్‌ కుమారుడు అజహర్‌ రియల్‌ సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్న అజీజ్‌గ్యాంగ్‌ను 2017 నవంబర్‌లో సంప్రదించాడు. భూవివాదం సెటిల్‌మెంట్‌ చేయాలని కోరిన అజహర్‌తో అజీజ్‌ గ్యాంగ్‌ సభ్యులు రూ.4లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు రూ.లక్ష అడ్వాన్స్‌ తీసుకున్న అజీజ్‌ గ్యాంగ్‌ తాము చెప్పినట్లు వినాలని రాజ్‌మహ్మద్‌ను హెచ్చరించారు.

ఫలితం లేకపోవడంతో అతని హత్యకు పథకం పన్నారు. 2017 డిసెంబర్‌ 18న రాజ్‌మహ్మద్‌ను కిడ్నాప్‌చేసి ధర్మపురి మండలం తుమ్మెనాల అడవిలో హత్య చేసి పరారయ్యారు. రాజ్‌మహ్మద్‌ బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వారం తర్వాత ధర్మపురి అటవీప్రాంతంలో రాజ్‌మహ్మద్‌ మృతదేహాన్ని వెలికితీశారు. డిసెంబర్‌ చివరి వారంలో మృతుడి అన్న సోదరుడు అజహర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో రాజ్‌మహ్మద్‌ను సుఫారీగ్యాంగ్‌ హత్య చేసినట్లు తేలింది. అనంతరం ఈ హత్యకు సంబంధం ఉన్న అజీజ్‌గ్యాంగ్‌తోపాటు షబ్బీర్, ధర్మపురికి చెందిన బాబాను ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. ఈ హత్యలో కీలకంగా వ్యవహరించిన ముఠాసభ్యులు మహ్మద్‌ రఫీ(32), గంగేశ్వర్‌(31)ను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ ముఠా లీడర్‌ అజీజ్‌ కోసం గాలింపు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సైలు రవికుమార్, మధూకర్‌తోపాటు కానిస్టేబుళ్లు నరేశ్‌రావు, శేఖర్, సురేష్‌బాబు, పండరీలకు సీఐ రివార్డులు అందించారు.

Advertisement
Advertisement