గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట | Sakshi
Sakshi News home page

గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట

Published Sun, Oct 13 2019 8:08 AM

Ganja Transport Gang Arrested In Krishna District - Sakshi

సాక్షి, హనుమాన్‌జంక్షన్‌: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలను నియమించామని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. చెన్నై – కోల్‌కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం ఎ.సీతారామపురం సెంటర్‌లో వీరవల్లి పోలీసులు శనివారం గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నారు. రూ.20 లక్షలు విలువైన గంజాయి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు వీరవల్లి పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై పక్కా సమాచారం రావటంతో వీరవల్లి ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు నేతృత్వంలో పోలీస్‌ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏపీ 16 యూ 8793 నంబర్‌ గల లారీలో 200 కేజీల బరువు కలిగిన 100 గంజాయి ప్యాకెట్లు తరలించటాన్ని గుర్తించారు. ఈ లారీతో పాటు డ్రైవర్‌ కూచిపూడి ఫ్రాన్సిస్, సహాయకుడు బండి నాగరాజులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా విశాఖ జిల్లా జె.నాయుడుపాలెం గ్రామం నుంచి ఈ నెల 11వ తేదీన గంజాయి లోడుతో బయలుదేరినట్లు తెలిపారు. ఈ గంజాయి ప్యాకెట్లను గన్నవరం చేర్చేందుకు డ్రైవర్‌ ఫ్రాన్సిస్‌కు రూ.1.50 లక్షలు, సహాయకుడు బండి నాగరాజుకు రూ.50 వేలు ఇచ్చేట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

గంజాయి అక్రమ రవాణా ప్రధాన సూత్రధారులు, ఎవరెవరికి వీటిని సరఫరా చేస్తున్నారనే వివరాలపై పోలీసులు వీరిద్దరిని తమదైన శైలిలో విచారణ చేపట్టి ఆరా తీశారు. కాగా ప్రధాన సూత్రధారుడిని పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను నియమించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, కాలేజి విద్యార్థులకు వీటిని సరఫరా చేయటంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే నూజివీడులో గంజాయి వ్యసనానికి గురైన ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను అరెస్ట్‌ చేశామని, వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్‌ ఇచ్చామని తెలిపారు. కాలేజి విద్యార్థులకు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ముఠాపై కూడా నిఘా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 200 కేజీల గంజాయిని సీజ్‌ చేశామని చెప్పారు. వీటిని తరలిస్తున్న కూచిపూడి ఫ్రాన్సిస్, బండి నాగరాజులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. గన్నవరం మండలం కట్టుబడిపాలెంకు చెందిన ఫ్రాన్సిస్‌కు విశాఖ జిల్లా రోలుకుంట మండలం జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన బండి నాగరాజుతో ఏర్పడిన పరిచయంతోనే గంజాయి అక్రమ తరలింపునకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఎస్పీ వివరించారు. రూ.20 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న వీరవల్లి ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబును నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, హనుమాన్‌జంక్షన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.వెంకట రమణ అభినందించారు.

Advertisement
Advertisement