పుట్టిన రోజు వేడుకలు చేసుకోకుండానే.. 

3 Aug, 2019 08:10 IST|Sakshi
మృతిచెందిన విద్యార్థిని ఉమాదేవి , రైతు సోమన్న

పొద్దు పొడిస్తే ఆ విద్యార్థినిది పుట్టిన రోజు. బడి నుంచి ఇంటికొచ్చేటప్పుడు రేపు చాక్లెట్లు పంచుతానని స్నేహితులందరికీ చెప్పి గంతులేసింది. పుస్తకాల సంచి అలా పడేసి, మిద్దెపై ఆరేసిన బొంతలు తెచ్చుకునేందుకు గబగబా మెట్లెక్కింది. మాయదారి కరెంట్‌ మిద్దెపై మాటు వేసి ఉంది. బొంత పట్టుకోగానే ఎక్కడికి వెళ్తావన్నట్లు తననూ కరెంట్‌ పట్టేసింది. 
విడిపించుకునేందుకు యత్నించి ఓడిపోయింది. 

సాక్షి, పాణ్యం(కర్నూలు) : మండల పరిధిలోని తమ్మరాజుపల్లె గ్రామంలో విద్యుదాఘాతంతో శుక్రవారం ఓ విద్యార్థిని మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మద్దమ్మ, అచ్చెన్న పెద్ద కుమార్తె ఉమాదేవి(22) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు తల్లిదండ్రులతో కొత్త దుస్తులు, చాక్లెట్లు కొనిపించుకొని సిద్ధం చేసుకుంది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం బడి నుంచి వచ్చిన విద్యార్థిని పుస్తకాల సంచి ఇంట్లో పెట్టి మిద్దెపైనున్న బొంతలు తీసుకొచ్చేందుకు వెళ్లింది. మెయిన్‌ లైన్‌ నుంచి ఇంట్లోకి తీసుకున్న విద్యుత్‌ తీగకు సపోర్ట్‌గా పెట్టిన ఇనుప రాడ్‌ను తాకింది. దానికి విద్యుత్‌ ప్రవహించడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్ప కూలింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆటోలో నంద్యాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అప్పటిదాక ఆడిపాడిన ఉమాదేవి ఇక లేదనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, తోటి స్నేహితులు మృతదేహం వద్ద విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది.  

పైరుకు నీరు పెట్టేందుకు వెళ్లి కౌలు రైతు మృతి 
సి.బెళగల్‌ : మండలంలోని పోలకల్‌ గ్రామానికి చెందిన కౌలు రైతు బోయ బండమీది నడిపి సోమన్న (43) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన రైతు నడిపి సోమన్న తనకున్న రెండు ఎకరాల పొలంతోపాటు, మరో ఎనిమిది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఉల్లి సాగు చేసుకుంటున్నాడు. శుక్రవారం ఉల్లినాటు వేసేందుకు కూలీలతో పొలానికి వెళ్లాడు. పైరుకు నీరు పెట్టేందుకని బావిలో నీటిమట్టం చూస్తూ మోటర్‌ను తాకగానే విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. ఆ వెంటనే విద్యుత్‌ తీగ రైతుమీద పడటంతో గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా