కన్ను పీకి..కాలునరికి.. | Sakshi
Sakshi News home page

బాలిక హత్య    

Published Sat, May 12 2018 2:08 PM

The girl is killed - Sakshi

జయపురం : నవరంగ్‌పూర్‌ జిల్లాలో అమానుష చర్య బయల్పడింది. 8 ఏళ్ల బాలికను హత్య చేసి పొదల్లో పడేశారు. హత్య చేసిన వారు ఆ బాలిక రెండు చెవులు కోసేశారు. అంతే కాకుండా బాలిక కడుపుపై, తలపైన తీవ్రంగా గాయపరిచారు. ఆమె ఎడమ కాలిని నరికేశారు. ఎడమ కన్ను పీకేశారు. ఇంతటి అమానుషానికి ఒడిగట్టి ముక్కు పచ్చలారని బాలికను చంపిన ఆ కసాయిలు ఎవరో తెలియలేదు. దుష్టశక్తుల పేరిట ఆ బాలికను ఎవరో బలి ఇచ్చి ఉంటారని, అందుకే బాలిక అంగాలను తొలగించారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. 

రెండు రోజులుగా కానరాని బాలిక

నవరంగ్‌పూర్‌ జిల్లా రాయిఘర్‌ సమితి కొచరాపర ఆదివాసీ గ్రామస్తుడు సుఖా గోండ్‌ కుమార్తె  పూజా గోండ్‌ బుధవారం సాయంత్రం నుంచి కనిపించలేదని, గ్రామంలో ఎవరి ఇంటిలోనైనా ఆడకుంటుందేమోనని తల్లి దండ్రులు అన్ని ఇళ్లకు వెళ్లి వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో గ్రామ పరిసర ప్రాంతాల్లోని తోటల్లో , పొలాల్లో గాలించారు. ఆమె జాడ లేకపోవడంతో సమీప గ్రామంలో ఉంటున్న తమ బంధువులకు ఫోన్‌ చేసి బాలిక ఏమైనా వచ్చిందా అని ఆరాతీశారు.

వారింటికి కూడా వెళ్లకపోవడంతో   బంధువులు, తల్లిదండ్రులు బిడ్డ ఏమైందోనని విచారంలో మునిగిపోయారు. గురువారం తిరిగి బాలిక బంధువులు, గ్రామస్తులు బాలిక జాడ కోసం గాలిస్తుండగా గ్రామానికి కొంత దూరంలోని ఒక గడ్డి వాములో బాలిక శవమై ఆమె పెద్దనాన్న సుధురాం గోండ్‌కు కనిపించింది. దీంతో  ఆయన   తమ్ముడికి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు బాలిక మృతదేహాన్ని చూసి భోరున విలపించారు.

మృతదేహాన్ని పరిశీలించి క్షుద్రపూజలు చేసి చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి తాను ఈ ప్రాంతంలో వెతికినప్పుడు అక్కడ ఎటువంటి మృతదేహం లేదని, అంటే ఎవరో దుండగులు ఎక్కడో క్షుద్ర పూజలు చేసి హత్య చేసి పడేశారని సుధారాం గోండ్‌ ఆరోపిస్తున్నాడు. 

కేసు నమోదు చేసిన పోలీసులు

దీంతో బాలిక బంధువులు కుందెయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోవింద చం ద్ర బురద, కుందెయి పోలీసు అధికారి పితాంబర సాగర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ భవానీ మిశ్రా  సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులు, మృతురాలి తల్లిదండ్రులను విచారణ చేశారు.

ఇంత చిన్న పిల్లను ఎవరు హత్య చేశారో కనిపెడతామని పోలీసులు తెలిపారు. బాలిక పెదనాన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం బాలికను ఎక్కడో చంపి ఇక్కడ పడేసిఉంటారన్నారు. అభంశుభం తెలియని బాలికను చంపిన హంతకులను కఠినంగా శిక్షిం చాలని పోలీసులను గ్రామస్తులు కోరుతున్నారు.   

Advertisement
Advertisement