గంగలో కలిసిన టీడీపీ పరువు.. | Sakshi
Sakshi News home page

అదృశ్య హస్తం ఎవరిది?

Published Wed, Jun 27 2018 6:43 AM

How React TDP Party On Sri Goutami Murder Case West Godavari - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు, నర్సాపురం : సంచలనం కలిగించిన శ్రీగౌతమి మృతి కేసులో అసలు రహస్యం బట్టబయలైంది. టీడీపీ నేతలే హంతకులుగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతి ప్రాణాలు నిలువునా తీశారని తేలిపోయింది. కేసులో ప్రధాన నిందితులైన టీడీపీ నేత సజ్జా బుజ్జి, జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్‌లతో పాటు మరో ఇద్దరు టీడీపీ నాయకులు బొల్లంపల్లి రమేష్, బాలం ఆండ్రూలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసులో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. 2017 జనవరి 18వ తేదీన శ్రీగౌతమి, ఆమె చెల్లెలు పావని ద్విచక్ర వాహనంపై వస్తుండగా కారుతో గుద్దించి హత్యకు ప్రయత్నించారు.

ప్రమాదంలో శ్రీగౌతమి మృతిచెందగా, ఆమె సోదరి పావని రెండు రోజుల తరువాత స్పృహలోకి వచ్చి తన అక్కది హత్యని మొత్తుకుంది. పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదు. సాధారణంగా జరిగిన యాక్సిడెంట్‌ కారణంగానేశ్రీగౌతమి చనిపోయిందని తేల్చిచెప్పి కేసును క్లోజ్‌ చేశారు. సీఐ నుంచి ఎస్పీ వరకూ ఇదే వాదన వినిపించారు. తరువాత పావని సీఐడీని ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. ఇది హత్యేనంటూ సీఐడీ తేల్చడంతో, గత్యంతరంలేని పరిస్థితుల్లో పోలీసులు మళ్లీ కేసును తీసుకుని విచారణ జరిపి పథకం ప్రకారం హత్య చేశారని చెప్పుకొస్తున్నారు. మరి మొదట్లో ఎవరి వత్తిడి మేరకు పోలీసులు కేసును పట్టించుకోలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

తూతూ మంత్రంగా విచారణ
తొలుత శ్రీగౌతమి కేసు యాక్సిడెంట్‌ అని పోలీసులు తేల్చారు. విశాఖపట్నంకు చెందిన ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. తన అక్కకు టీడీపీ నేతతో వివాహం జరిగిందని, అతని భార్య నుంచి అక్క బెదిరింపులను ఎదుర్కొంటుందని పావని ఆరోపిస్తోంది. పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదు. అంతేకాదు అక్క చనిపోకముందు తమను కారులో కొందరు వెంబడించారని, కారులోంచి తన చున్నీ పట్టుకుని లాగే ప్రయత్నం చేశారని చెప్పింది.  ఇతర విషయాలు పక్కన పెడితే..కనీసం టీజింగ్‌ అంశాలపై కూడా పోలీసులు శ్రద్ధ పెట్టకపోవడం అనుమానాలకు తావిచ్చింది. కేవలం రెండు సెక్షన్‌లలో నిందితులపై కేసు నమోదు చేసి ఊరుకున్నారు. మరోవైపు శ్రీగౌతమికి టీడీపీ నేత సజ్జా బుజ్జితో పెళ్లి అవ్వడంలాంటి విషయాలు పావని వెలుగులోకి తేవడంతో కేసు మరోమలుపు తిరిగింది. ఇది హత్య అని, తెరవెనుక టీడీపీ నేత ఉన్నాడని శ్రీగౌతమి కుటుంబ సభ్యులు ఆరోపించారు.  సజ్జా బుజ్జి, అతని భార్యను కూడా పోలీసులు స్టేషన్‌కి కాకుండా, ఓ గెస్ట్‌హౌస్‌కు రప్పించి, విచారణ చేయడం చర్చనీయాంశమయ్యింది.

సెల్‌ ఫోన్‌ కాల్‌డేటా ఇప్పుడే గుర్తొచ్చిందా
ప్రస్తుతం ఎంత క్లిష్టమైన కేసులో అయినా సెల్‌ఫోన్‌ కాల్‌డేటా కీలకంగా మారింది. కాల్‌డేటా ఆధారంగానే చాలా కేసులను దేశవ్యాప్తంగా పోలీసులు ఛేదిస్తున్నారు. గతంలో అనేక క్లిష్టతరమైన కేసులు పరిష్కరించడంలో చొరవ చూపిన పశ్చిమ పోలీసులు మరి మొదట్లో ప్రమాదం జరిగిన వెంటనే శ్రీగౌతమి ఫోన్‌ కాల్‌డేటాపై ఎందుకు దృష్టిపెట్టలేదనేది జవాబు లేని ప్రశ్న. సీఐడీ కాల్‌డేటాను ఆధారం చేసుకుని దర్యాప్తు చేస్తేనే కానీ పోలీసులకు ఆ విషయం గుర్తుకు రాలేదంటే నమ్మశక్యం కాని విషయమే. బుజ్జి సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడమే ఇందుకు కారణమనేది మొదటి నుంచి వస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కేసును మసిపూసే ప్రయత్నం సాగినట్టుగా తెలుస్తోంది. బుజ్జి జిల్లాలో ఎమ్మెల్యేలు, ముంత్రులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే నేరుగా రాష్ట్ర స్థాయిలో లాబీయింగ్‌ చేసుకున్నాడనే ప్రచారం ఉంది. ఇప్పుడు విషయం సీఐడీ ద్వారా వెల్లడి కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు రంగంలోకి దిగి చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.  హత్య కేసును తూతూమంత్రంగా విచారణ చేసి మూసివేసిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు ఉం టాయనే దానిపై చర్చ సాగుతోంది. అప్పటి పోలీసు అధికారుల తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.

గంగలో కలిసిన టీడీపీ పరువు
శ్రీగౌతమి మృతి తరువాత అమె చెల్లెలు పావని పెద్ద పోరాటమే చేసింది. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష రాజకీయపార్టీలు, మహిళాసంఘాలు, విద్యార్థులు ఆందోళనలు చేశారు. అదంతా అరణ్యరోదనే అయ్యింది. కేసును 15 రోజుల్లోనే పోలీసులు క్లోజ్‌ చేశారు. కేసును మూసేసిన వెంటనే ప్రధాన నిందితులు జల్సాలు చేసుకున్నట్టు తెలిసింది. బొల్లంపల్లి రమేష్‌ ద్వారా మొత్తం నిందితులు బ్యాంకాక్‌ తదితర దేశాలు తిరిగినట్టు సమాచారం. ఇంత జరిగినా నిందితులంతా టీడీపీ కార్యక్రమాల్లో మామూలుగానే పాల్గొంటూ వచ్చారు. ఇప్పుడు అసలు విషయం బట్టబయలు కాడవంతో స్థానికంగా టీడీపీ పరువు పోయింది. గతంలో ఎంపీపీగా కూడా పనిచేసిన బాలం ప్రతాప్‌ ఏకంగా ప్రాణాలు తీసే స్థాయికి దిగజారిపోయాడు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జా బుజ్జి వ్యవహారంతో టీడీపీ అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయని మరోసారి తేటతెల్లమయ్యింది. పోలీసులు వీరిని అరెస్ట్‌ చేశారని తెలియగానే, పట్టణంలో ఉన్న వారికి చెందిన ప్లెక్సీలను దేశం శ్రేణులు హడావుడిగా తొలగించాయి. అయితే ప్రాణాలు తీసే ఘాతుకానికి ఒడికట్టిన నేతలపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement