భర్త ఇంటి ఎదుట యువతి మౌనపోరాటం | Sakshi
Sakshi News home page

నాడు పెళ్లి చేసుకున్నాడు.. నేడు సంబంధం లేదంటున్నాడు

Published Fri, Jul 6 2018 8:02 AM

Husband Cheating Wife In YSR Kadapa - Sakshi

బద్వేలు అర్బన్‌ : ఆరేళ్లపాటు ప్రేమిస్తున్నానని నమ్మబలికించాడు. ఆ తర్వాత కువైట్‌కు వెళ్లిన ఆ యువకుడు యువతిని కూడా కువైట్‌కు పిలిపించుకుని అక్కడే పెళ్లి చేసుకున్నాడు. పట్టుమని వారం రోజులు కాపురం చేశాడో లేదో మాయమాటలు చెప్పి యువతిని అక్కడే వదిలేసి స్వగ్రామానికి చేరుకున్నాడు. అంతటితో ఆగక మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. కువైట్‌లో ఉండి విషయం తెలుసుకున్న సదరు యువతి అతికష్టం మీద బద్వేలుకు చేరుకుని తన భర్తను నిలదీసింది. తనకు సంబంధం లేదని తెగేసి చెప్పడంతో చేసేది లేక భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు యువతికి నచ్చజెప్పి స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమె ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. గురువారం బద్వేలు పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

పట్టణంలోని వెంగమాంబనగర్‌లో నివసించే షేక్‌ షరీఫ్‌ అనే యువకుడు అదే వీధిలోని సాయిప్రనూష అనే యువతిని ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. కొన్నేళ్ల పాటు ఇద్దరు కలిసి మెలిసి తిరిగిన అనంతరం గతేడాది కువైట్‌కు వెళ్లిన షరీఫ్‌ యువతితో ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. ఈ ఏడాది జనవరిలో ఆ యువతికి వీసా తీసి కువైట్‌కు రావాలని తెలపడంతో ఆమె ఏప్రిల్‌ 28న కువైట్‌కు వెళ్లింది. ఇద్దరు అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తూ జూన్‌ 23న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రంజాన్‌ పండుగకు ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి యువతిని అక్కడే వదిలేసి స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే షరీఫ్‌ పండుగ కోసం వెళ్లలేదని, తనకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరుగుతుందని సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రనూష జూన్‌ 30న స్వగ్రామానికి చేరుకుంది.

వచ్చిన వెంటనే భర్త వద్దకు వెళ్లి నిలదీస్తే అదంతా పుకార్లని కొట్టి పారేశాడు. అయితే మరో రెండు రోజుల్లో షరీఫ్‌కు వేరే అమ్మాయితో వివాహం జరుగుతోందని తెలిసి గురువారం ఇంటి వద్దకు వెళ్లి షరీఫ్‌ తల్లిదండ్రులను నిలదీసింది. షరీఫ్‌ ఇంట్లో లేడని, ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పడంతో ఇంటి ఎదుటే బైఠాయించింది. ఇంతలో షరీఫ్‌ను అతని సోదరుడు ఇంటి నుంచి తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న అర్బన్‌ పోలీసులు యువతి వద్దకు వచ్చి ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని తెలపడంతో స్టేషన్‌కు వెళ్లి షరీఫ్‌పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement