కాయ్‌.. రాజా కాయ్‌..! | Sakshi
Sakshi News home page

కాయ్‌.. రాజా కాయ్‌..!

Published Mon, Apr 15 2019 9:49 AM

IPL Matches Full Bettings In Warangal - Sakshi

కామారెడ్డి క్రైం: క్రీడాకారులకు రూ.కోట్లు కుమ్మరిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఐపీఎల్‌–12 క్రికెట్‌ మ్యాచ్‌లు అదే స్థాయిలో బెట్టింగ్‌ రాయుళ్ల జీవితాల్లో చీకట్లను నింపుతున్నాయి. బెట్టింగ్‌లు నేరమని చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిసినా యువత అటువైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుత వేసవిలో కొనసాగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) క్రికెట్‌ మ్యాచ్‌లపై జోరుగా బెట్టింగ్‌ సాగుతోంది. ముఖ్యంగా యువకులు బెట్టింగ్‌ మాయలో పడి తమ డబ్బును, సెల్‌ఫోన్లను, మోటర్‌ బైకులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఉమ్మడి జిల్లాలో అనధికారిక అంచనా ప్రకారం ప్రతిరోజు రూ.లక్షల్లో బెట్టింగ్‌ కొనసాగుతోంది. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో బెట్టింగులు నడుస్తున్నట్లు తెలిసింది. కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు లక్షల్లో చేతులు మారుతున్నాయని తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఐపీఎల్‌ మ్యాచ్‌లపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.

ఒక్క బాన్సువాడ పట్టణంలోనే ప్రతీ రోజు రూ.500 నుంచి రూ. వేలు, లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బెట్టింగ్‌లకు పాల్పడుతూ తమ ఆస్తులను కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. పలువురు పారిశ్రామికేవేత్తల మధ్య రూ.లక్ష చొప్పున బెట్టింగ్‌ సాగినట్లు తెలిసింది. ఇలా వందలాది మంది ఐపీఎల్‌ జట్లపై నమ్మకంతో గెలుపు, ఓటములను చూపుతూ బెట్టింగులకు పాల్పడుతున్నారని తెలిసింది. 

పోలీసుల నిఘా అవసరం  
ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న బెట్టింగులపై పోలీసుల నిఘా కొరవడింది. బెట్టింగులకు పాల్పడుతున్న వారు సెల్‌ఫోన్లు వినియోగిస్తూ కేవలం ఫోన్‌లలోనే లావాదేవీలు కొనసాగిస్తుండడంతో పోలీసులకు సమాచారం అందడం లేదు. ఎవరు బెట్టింగులకు పాల్పడుతున్నారనే విషయమై పక్కా సమాచారం లేక వారు మిన్నకుండిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో బెట్టింగులపై ప్రత్యేకంగా సమాచారాన్ని రాబట్టి, కొందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటే, బెట్టింగులను నియంత్రించేందుకు వీలవుతుందని పరిశీలకులు అంటున్నారు. అనేక కుటుంబాలు బెట్టింగ్‌ జాడ్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, బెట్టింగులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొంటున్నారు. 

సెల్‌ఫోన్లలోనే చర్చలు.. 
ఐపీఎల్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే బెట్టింగులకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు మధ్యవర్తులుగా అవతారమెత్తి బెట్టింగ్‌ డబ్బులపై సెల్‌ఫోన్లలో బేరమాడుతున్నారు.  నేటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుంది? ఏ జట్టు ఓడి పోతుందనే? అంశంపై బేరమాడుతూ డబ్బులను ఫిక్స్‌ చేస్తున్నారు. మ్యాచ్‌లు కొనసాగిన తర్వాత గెలుపు/ఓటములపై ఫలితాలు రాగానే డబ్బుల కలెక్షన్‌ ప్రారంభిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రధానంగా ఇండ్లలో, దుకాణాల్లో కూర్చొని బెట్టింగ్‌ బేరాలను నడిపిస్తున్నారు.

ఒకవేళ ఓడిపోయిన పక్షంలో డబ్బులు లేకపోతే తమ సెల్‌ఫోన్లు, మోటర్‌ బైకులను ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల్ల యువకులే బెట్టింగుల్లో అధికంగా పాల్గొంటున్నారు. చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు, కూలీ పనులు చేసుకొనేవారు త్వరగా డబ్బులు సంపాధించవచ్చనే దురాశతో ఐపీఎల్‌ మ్యాచ్‌లపై బెట్టింగులకు దిగుతున్నారు. కొన్నిసార్లు బెట్టింగుల్లో గెలుపొందడంతో ముందు, వెనకా చూడకుండా తమ డబ్బులను బెట్టింగుల కోసం వెచ్చిస్తున్నారు. దీంతో కొందరు సర్వం కోల్పోతుండగా, మరి కొందరు డబ్బులు సంపాదిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. బెట్టింగుల కారణంగా ఆయా కుటుంబాలపై ప్రభావం చూపుతోంది.

బెట్టింగ్‌లకు ఆకర్షితులవుతూ... 
నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ ఏరియాల్లో కూడా బెట్టింగ్‌ దందా జరుగుతున్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లో సైతం చాలా మంది వీటిపై ఆసక్తిని చూపుతున్నారు. టాస్‌తోనే బెట్టింగ్‌ దందా ప్రారంభం కాగా, పేవరేట్‌ జట్టు, నాన్‌ ఫేవరేట్‌ జట్ల పేరుతో బెట్టింగ్‌లు కడుతున్నారు.

జట్లతో పాటు మ్యాచ్‌ సమయంలో రన్‌లు, సింగిల్‌లు, డబుల్, ఫోర్లు, సిక్స్‌లు, రనౌట్లు, స్టంప్‌లు ఇలా ప్రతి దానికి బెట్టింగ్‌ కడుతున్నారు. బెట్టింగ్‌ల కోసం ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను వాడుతున్నారు. ఇటీవలి కాలంలో అందుబాటు లోకి వచ్చిన యాప్‌ల ద్వారా బ్యాంక్‌ లావాదేవీలను కూడా నిర్వహిస్తున్నారు. డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు ఫోన్‌ పే, తేజ్, పేటీఎం యాప్‌లను వాడుతున్నారు. వీటి ద్వారా సులభంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. 1:2, 1:4, 1:5 అంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. బెట్టింగ్‌లు కాస్తూ యువత దానికి బానిసలుగా మారి ప్రతిరోజు ఆర్థికంగా నష్టపోగా వారి కుటుంబాలు చిధ్రమవుతున్నాయి.  

సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం 
బెట్టింగ్‌లకు పాల్పడడం చట్ట రీత్యా నేరం. ఐపీఎల్‌ మ్యాచ్‌లపై బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. నిఘా పెంచుతాం. బెట్టింగులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటాం. మాకు సమాచారం అందించాలి. –మహేష్‌గౌడ్, సీఐ, బాన్సువాడ.

Advertisement
Advertisement