అత్యాచార కేసు : ఆశారాం దోషి | Sakshi
Sakshi News home page

అత్యాచార కేసు : ఆశారాం దోషి

Published Wed, Apr 25 2018 10:53 AM

Jodhpur Court Convicts Asaram Bapu In Minor Rape Case - Sakshi

జోధ్‌పూర్‌ (రాజస్థాన్‌) : మైనర్‌ బాలికపై అత్యాచార కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను జోధ్‌పూర్‌ ఎస్సీ, ఎస్టీ ట్రయల్‌ కోర్టు దోషిగా తేల్చింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని దోషులుగా పేర్కొన్న కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. అయితే, ఆశారాంకు శిక్షపై కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతోంది. కోర్టు తీర్పుపై న్యాయపరంగా సలహా తీసుకుని ముందుకు వెళ్తామని ఆశారాం అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, కోర్టు తీర్పు నేపథ్యంలో జోధ్‌పూర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ కేసులో ఆశారాంకు శిక్ష పడటంపై బాధితురాలి తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పోరాటంలో వారికి మద్దతుగా నిలిచినందుకు పలువురికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యులుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. తీర్పు అనంతరం ఆశారాం అనుచరులు విధ్వంసక చర్యలకు దిగుతారేమోనన్న అనుమానంతో ఈ నెల 30వ తేదీ వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు.

ఈ కేసులో 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగష్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు.

అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్‌ చేయడం కూడా ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి. చివరికి 2013 సెప్టెంబర్‌ 1న ఆశారాంను జోధ్‌పూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేటు సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. మొత్తం 9 మంది సాక్ష్యుల్లో ముగ్గరు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు.

ఆశారాంకు బెయిల్‌ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన న్యాయమూర్తిని సైతం ఆశారాం ప్రైవేటు సైన్యం బెదిరించింది. దీంతో సుప్రీంకోర్టులో కూడా ఆశారాంకు బెయిల్‌ లభించలేదు.

మరో రెండు అత్యాచార కేసులు
ఆశారాం బాపూని అరెస్ట్‌ చేసి రెండు నెలలు తిరక్కుండానే సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆశారాంతో పాటు ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్‌ సమీపంలోని ఆశ్రమంలో 2001, 2006 సంవత్సరం మధ్య ఆశారాం తనపై చాలాసార్లు లైంగికంగా దాడులకు దిగాడని అక్క ఆరోపణలు చేస్తే, సూరత్‌ ఆశ్రమంలో నారాయణ సాయి తనను అత్యాచారం చేశాడంటూ చెల్లి కోర్టుకెక్కింది. దీంతో పోలీసులు నారాయణ సాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఆశారాం ఎలా ఎదిగాడు?
1941 సంవత్సరంలో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సింధ్‌ ప్రాంతంలో పుట్టిన ఆశారాం 15 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కేవలం మూడో తరగతి మాత్రమే చదువుకున్న అతను ఆధ్యాత్మిక మార్గం పట్టాడు. గురు లీలా షాజీ మహరాజ్‌ దగ్గర శిష్యరికం చేశాడు. 1972 సంవత్సరంలో గుజరాత్‌లోని మొతేరా దగ్గర సబర్మతి తీరంలో చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. తనని తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఏడాదిలోనే ఆ కుటీరం కాస్త ఆశ్రమంగా మారిపోయింది. ఆధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో ప్రఖ్యాతి వహించాడు. ప్రస్తుతం ఆయనకి దేశ విదేశాల్లో 400 ఆశ్రమాలు రెండు కోట్ల మంది శిష్యపరివారం ఉంది. పార్టీలకు అతీతంగా ఎందరో రాజకీయ వేత్తలు ఆయనకు పరమ వీర భక్తులు.

వివిధ రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు ఆయన ఆశ్రమాలకు అయాచితంగా భూ కేటాయింపులు చేశాయి. ఆశారాం ఆస్తులు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. ఏకంగా 10 వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని ఆయన కూడబెట్టాడు. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగునా వివాదాలే చోటు చోసుకున్నాయి. భూ కబ్జా ఆరోపణలు, ఆశ్రమంలో అనుమానాస్పద మృతులు వంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమం ఎన్ని అరాచకాలకు నెలవుగా మారిందో ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి.

Advertisement
Advertisement