పెద్దమ్మ తల్లి స్టిక్కర్‌ పట్టించింది.. | Sakshi
Sakshi News home page

పెద్దమ్మ తల్లి స్టిక్కర్‌ పట్టించింది..

Published Thu, Nov 29 2018 9:30 AM

KBR park Robbery Mystery Reveals - Sakshi

బంజారాహిల్స్‌:  కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌కువచ్చిన ప్రముఖ వ్యాపారి బెంజ్‌ కారు నుంచి రూ.10 లక్షలు అపహరించిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళంకు చెందిన అంబాటి శ్రీనివాస్‌  డ్రైవర్‌గా పనిచేస్తూ మాదాపూర్‌ సమీపంలోని గుట్టలబేగంపేటలో ఉంటున్నాడు. ఖరీదైన కార్లపై అతడికి పూర్తి అవగాహన ఉంది. ఈ నెల 18న కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌కు వచ్చిన వ్యాపారి చెరుకూరి కృష్ణమూర్తి అనంతరం తన బెంజ్‌ కారు ను జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 47లోని ప్లాట్‌ నెంబర్‌ 717 ముందు నిలిపి తన స్నేహితుడు అనూప్‌ కుమార్‌ ఇంట్లోకి వెళ్లాడు.

గంట తర్వాత బయటికి వచ్చి చూడగా వెనుక సీట్లో ఉన్న క్యాష్‌ బ్యాగ్‌ కనిపించకపోవడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యాక్టీవా బైక్‌పై ఓ యువకుడు వచ్చినట్లు గుర్తించారు సదరు బైక్‌ నెంబర్‌ కనిపించకపోవడంతో షోరూంలో అదే కలర్‌ బైక్‌ల వివరాలు తీసుకున్నారు. బైక్‌పై ఉన్న పెద్దమ్మతల్లి స్టిక్కర్‌ ఆధారంగా సదరు బైక్‌ను గుర్తించారు. అనంతరం బైక్‌ నడిపిన వ్యక్తి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌పై నిఘా ఉంచి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా నిందితుడి అదుపులోకి తీసుకొని విచారించగా తాళం వేయకుండా ఉన్న ఆ కారులోంచి డబ్బు తీసినట్లు అంగీకరించాడు. తన భార్యకు తెలియకుండా నగదు బ్యాగ్‌ను ఇంట్లో బీరువాపై దాచినట్లు తెలిపారు. రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకొని బుధవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement