భీమవరంలో బాలుడి కిడ్నాప్‌ | Sakshi
Sakshi News home page

భీమవరంలో బాలుడి కిడ్నాప్‌

Published Wed, Nov 1 2017 4:19 AM

Kidnapped boy in Bhimavaram - Sakshi

భీమవరం టౌన్‌: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం నాలుగేళ్ల వయస్సు కలిగిన బాలుడిని కిడ్నాప్‌ చేశారు. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఓ ఆగంతకుడు బెదిరించాడు. పోలీస్‌ స్టేషన్‌లో ఉండగానే మరోసారి ఫోన్‌ కాల్‌ చేసి స్టేషన్‌కు ఎందుకు వెళ్లావ్‌ ఫిర్యాదు చేసినా, మీడియాకు చెప్పినా సహించేది లేదంటూ బెదిరించాడు. వివరాల్లోకి వెళితే..  39వ వార్డు దుర్గాపురం ప్రాంతానికి చెందిన వడ్రంగి పనిచేసుకునే మామిడి లక్ష్మణరావు, దుర్గ దంపతులకు శ్యామ్‌ గౌతమ్‌ లేక లేక పుట్టిన సంతానం. మెంటేవారితోటలోని వండర్‌ కిడ్స్‌ కిండర్‌ గార్డెన్‌ స్కూల్లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. సుమారు 11.20 గంటల సమయంలో ఆగంతకుడు స్కూల్‌ వద్దకు వెళ్లి టీచర్‌తో శ్యామ్‌ గౌతమ్‌ కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్‌ అయిందని నమ్మించాడు.

శ్యామ్‌ గౌతమ్‌ తండ్రితో ఫోన్‌లో మాట్లాడమని తన సెల్‌ఫోన్‌ నుంచి ఎవరికో ఫోన్‌ కాల్‌ చేసి టీచర్‌కు ఇచ్చాడు. అవతల వ్యక్తి మాట్లాడ్డంతో టీచర్‌కు కొంత నమ్మకం కలిగి ఆగంతకుడికి బాలుడిని అప్పగించగా మోటార్‌ సైకిల్‌పై తీసుకుపోయాడు. తర్వాత గంటకు బాలుడి తండ్రి లక్ష్మణరావుకు ఆగంతకుడి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. రూ.5 లక్షలు ఇస్తేగాని వదిలిపెట్టనంటూ బెదిరించాడు. దీంతో అతను కంగారు పడి పోలీసులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ టి.ప్రభాకర్‌బాబు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు సంఘటన వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాల్లో ఆగంతకుడ్ని గుర్తించేందుకు స్టేషన్‌లో ఫుటేజిని పరిశీలిస్తున్నారు. టీచర్‌ను కూడా పిలిపించి సీసీ ఫుటేజిని పరిశీలించి గుర్తుపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సీఐ డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ఆగంతకుడి ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా పట్టుకునేందుకు గాలిస్తున్నారు. నవంబర్‌ 1వ తేదీ శ్యామ్‌గౌతమ్‌ పుట్టిన రోజు కావడం, ఇంతలో ఇలా జరగడంతో తల్లి దుర్గ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement