కుక్కల దాడిలో 40 గొర్రెపిల్లల హతం

5 Mar, 2018 07:14 IST|Sakshi
కుక్కల దాడిలో మృతిచెందిన గొర్రె పిల్లలు

రూ.1.6 లక్షల నష్టం

డోన్‌ టౌన్‌ : కృష్ణగిరి మండలం కర్లకుంట శివారులో ఆదివారం కుక్కలు దాడి చేయడంతో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. బాధితుల వివరాల మేరకు..మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు, వీరకుమార్‌ మేపు కోసం మందను కృష్ణగిరి మండలం కర్లకుంటకు తీసుకెళ్లారు. ఉదయం గొర్రెపిల్లలను కల్లం(ముళ్లకంప మధ్య)లో ఉంచి గొర్రెల మేపు కోసం బయటకు తీసుకెళ్లారు.

ఇంతలో ఊరకుక్కలు కల్లంలో ఉన్న గొర్రె పిల్లలపై దాడి చేశాయి. ఘటనలో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. మరో పదింటికి తీవ్రగాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత  ఘటనా స్థలికి చేరుకున్న కాపరులు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు రూ.1.6 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు.  

మరిన్ని వార్తలు