భార్య ఆచూకీ అడిగినందుకు.. చేతివేళ్లు విరిచి..

8 Jul, 2019 11:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : న్యాయం కోసం పోలీసు స్టేషను గడప తొక్కిన ఓ దళిత వ్యక్తి పట్ల రక్షకభటులు కర్కశంగా ప్రవర్తించారు. తన భార్య ఆచూకీ కనుక్కోవాలని ఫిర్యాదు చేసిన అతడిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురిచేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మనిపురి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు... బులంద్‌షహర్‌కు చెందిన ఓ 48 ఏళ్ల దళిత వ్యక్తి తన భార్యతో కలిసి శుక్రవారం రాత్రి బైక్‌పై బంధువుల ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో కారులో ఆ దంపతులను వెంబడించిన కొంతమంది దుండగులు అతడిని కొట్టి.. భార్యను తమతో పాటు తీసుకువెళ్లారు.

ఈ క్రమంలో కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. అయితే అతడి ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. బాధితుడినే నిందితుడిగా పేర్కొంటూ తీవ్రంగా కొట్టారు. అనంతరం తన భార్యను తానే చంపానని స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న అతడి భార్య గుర్తు తెలియని దుండగులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. అయినప్పటికీ పోలీసులు ఆమె భర్తనే నిందితుడంటూ చేతివేళ్లు విరిచేశారు.

కాగా ఈ ఘటనపై మనిపురి ఎస్పీ అజయ్‌ శంకర్‌ రాయ్‌ తీవ్రంగా స్పందించారు. బాధితుడి కాళ్లు, నడుముపై తీవ్ర గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఘటనకు కారణమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే బాధితుడి భార్య ఆరోపించినట్లుగా ఆమెపై అత్యాచారం జరుగలేదని వైద్యులు ధ్రువీకరించినట్లు తేలడంతో ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు