గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మృతి     | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మృతి    

Published Sat, Aug 4 2018 12:35 PM

Man Died By Heart Attack  - Sakshi

కాశీబుగ్గ శ్రీకాకుళం : అగ్రిగోల్డ్‌లో యాజమాన్యం చెల్లింపులు నిలిపివేయడంతో ఖాతాదారుల ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురైన ఏజెంట్‌ గుండెపోటుతో మరణించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు సాయికాలనీకి చెందిన కణితి కేశవరావు(56) శుక్రవారం వేకువజామున మృతిచెందారు. అగ్రిగోల్డ్‌ సంస్థ స్థాపించినప్పటి నుంచి పనిచేస్తున్నారు. సొంతంగా రూ.20లక్షలు డిపాజిట్‌ చేయడంతో ఏజెంట్‌గా చేరే అవకాశం కల్పించారు.

దీంతో జంట పట్టణాల్లోని ఆయన బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు, జీడికార్మికులు నుంచి మొత్తం రూ.6కోట్ల వరకూ డిపాజిట్లు కట్టించారు. ప్రస్తుతం ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఖాతాదారులు.. మిమ్మల్ని నమ్మి అధికమొత్తంలో చెల్లించామని డబ్బులు ఎలాగైనా ఇప్పించాలని ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు.

తమ పాప పెళ్లికి సాయంగా ఉంటుందని డబ్బులు కట్టామని, ఎలాగైనా సాయం చేయాలని కోరడంతో వారికి బియ్యం బస్తాలతో పాటు రూ.20వేలు ఆర్థిక సాయం కూడా అందించేవారు. కొన్ని రోజులుగా ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధిమవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. రోజూ అగ్రిగోల్డ్‌ ఫైల్‌ తీసుకుని సుదీర్ఘంగా ఆలోచిస్తుండేవారు.

గురువారం రాత్రి ఫైళ్లు చూశారు. శుక్రవారం వేకువజామున మరణించారు. ఆయనకు భార్య కల్యాణి, కుమార్తె సుమ, కుమారుడు ప్రవీణ్‌ ఉన్నారు. విషయం తెలుసుకున్న ఏజెంట్లు ఆయన ఇంటివద్దకు చేరారు. ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement