భార్యను టెట్‌ పరీక్ష హాల్‌లోకి పంపి.. | Sakshi
Sakshi News home page

హత విధీ..

Published Wed, Jun 13 2018 8:46 AM

Man Died With Heart Stroke In TET Exam Centre Chittoor - Sakshi

చిత్తూరు, రేణిగుంట: ‘‘ భార్యతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్ష రాయించేందుకు, రేణిగుంట సమీపంలోని ఓ పరీక్ష కేంద్రానికి మంగళవారం ఉదయం చేరుకున్న ఓ వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. పరీక్ష బాగా రాయాలని ఆల్‌ ద బెస్ట్‌ చెప్పి.. భార్యను కేంద్రంలోని పంపిన గంట వ్యవధిలోనే ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. చుట్టుపక్కల వారు గుమిగూడేలోపే మృత్యు ఒడికి చేరాడు. కాగా భర్త మరణించిన విషయం తెలిస్తే తట్టుకోలేదన్న భావనతో నిర్వాహకులు పరీక్ష పూర్తయ్యే వరకు ఆమెకు ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. పరీక్ష రాసి మధ్యాహ్నం 12 గంటలకు బయటకు వచ్చి విగతజీవిగా భర్త పడి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. గుండెలు బాదుకుంటూ మృతదేహంపై పడి భోరున విలపించింది. ఈ  ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద మంగళవారం చోటుచేసుకుంది.’’     

రేణిగుంట పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లె పంచాయతీ కొండేపల్లెకి చెందిన ప్రభాకర్‌(33), భార్య సరితకు మంగళవారం టెట్‌ ఆన్‌లైన్‌ అర్హత పరీక్ష ఉంది. దీంతో వారు మంగళవారం తెల్లవారుజామున ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి చిత్తూరుకు చేరుకున్నారు. అక్కడ బైక్‌ పార్క్‌ చేసి బస్సులో తిరుపతికి చేరుకుని అక్కడ నుంచి పరీక్ష కేంద్రం ఉన్న అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలకు వచ్చారు. టెట్‌ పేపర్‌–1 పరీక్ష రాసేందుకు ఉదయం 8.30 గంటలకు భార్య సరితను కేంద్రంలోకి పంపి ఆమె కోసం కళాశాల ప్రాంగణంలో ప్రభాకర్‌ కూర్చుని నిరీక్షించాడు.

10 గంటల సమయంలో అతనికి గుండెపోటుకు గురై కూర్చున్న చోటే కుప్పకూలాడు. పక్కనున్న వారంతా తేరుకుని దగ్గరికి చేరేలోపే తుదిశ్వాస విడిచాడు. పరీక్ష రాసి బయటకు వచ్చిన సరిత భర్త మృతి చెందడాన్ని చూసి తీవ్ర మనోవ్యధకు గురైంది. ‘ఏవండీ పరీక్ష బాగా రాశాను.. లేవండి.. ఇంటికెళదాం’ అంటూ  రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అనంతరం మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకెళ్లారు. కాగా మృతుడికి ముగ్గురు పిల్లలు యశ్వంత్‌(9), హాసిని(7), గోపీకృష్ణ(5) ఉన్నారు. ప్రభాకర్‌ చిత్తూరులో మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన మృతి చెందడంతోవారి కుటుంబం వీధిన పడిందని.. ప్రభుత్వం ఆదుకోవాలని మృతుని బంధువులు వేడుకుంటున్నారు.

Advertisement
Advertisement