లారీలు ఢీకొని డ్రైవర్‌ మృతి   | Sakshi
Sakshi News home page

లారీలు ఢీకొని డ్రైవర్‌ మృతి  

Published Wed, Aug 15 2018 10:52 AM

Man Died In Road Accident  - Sakshi

ఇల్లెందు : రెండు లారీలు ఢీకొన్న ఒక డ్రైవర్‌ మృతిచెందాడు. మరో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని బొజ్జాయిగూడెం సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఇల్లెందుకు చెందిన లారీ, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ నుంచి ఐరన్‌ లోడ్‌తో పాల్వంచ కేటీపీఎస్‌కు వస్తోంది. బొగ్గు లోడుతో హెదరాబాద్‌ నుంచి మరో లారీ వస్తోంది. మంగళవారం ఉదయం బొజ్జాయిగూడెం సమ్మక్క గద్దెల సమీపంలో ఈ రెండు లారీలు ఢీకొన్నాయి.

ఇల్లెందు లారీ డ్రైవర్‌ లక్ష్మణ్, తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 108 సిబ్బంది ఇల్లెందు వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అతడు అక్కడే మృతిచెందాడు.  మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం బంచరాయితండాకు చెందిన లక్ష్మణ్‌కు భార్య కుమారి, మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న కూతురు ఉన్నారు.

ఇల్లెందు ఎస్‌ఐ బి.రాజు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌కు చెందిన లారీ డ్రైవర్‌ రాజశేఖర్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఇల్లెందు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స పొందాడు.  

ఇల్లెందు లారీలో మంటలు 

ఇల్లెందు లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. అప్పటికే అటు వైపు వచ్చిన ప్రయాణికులు, అపస్మారకంగా స్టీరింగ్‌పై పడిపోయిన  డ్రైవర్‌ లక్ష్మణ్‌ను వెంటనే కిందకు లాగారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు.

మిట్టపల్లి వద్ద మరో రెండు లారీలు..

తల్లాడ : మండలంలోని మిట్టపల్లి హైలెవల్‌ వంతెన వద్ద మంగళవారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒక లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఒక లారీ (టీఎస్‌ 12 యుబీ 7965) ఖమ్మం వైపు, మరో లారీ (ఓడీ 01 ఆర్‌ 8583) సత్తుపల్లి వైపు వెళ్తున్నాయి. మిట్టపల్లి బ్రిడ్జి వద్ద ఇవి రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఖమ్మం వైపు వెళుతున్న లారీ డ్రైవర్‌ పొన్నం గణేష్, క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.

కాళ్లు, చేతులకు, ఇతరచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని మిట్టపల్లి గ్రామస్తులు బయటకు తీశారు. ఇతనిది సూర్యాపేట జిల్లా తిరుమలగరి మండలం. మరో లారీ డ్రైవర్‌ సంతోష్‌కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బ్రిడ్జి సైడ్‌ వాల్‌కు ఒక లారీ తగిలి ఆగిపోయింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఆ లారీ పడిపోయినట్టయితే ప్రాణాపాయం ఉండేది. ఈ ప్రమాదంతో గంటన్నరపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. తల్లాడ ఎస్‌ఐ మేడా ప్రసాద్, సిబ్బంది కలిసి వాహనాలను వెంగన్నపేట, బిల్లుపాడు మీదుగా తల్లాడకు మళ్లించారు.  కేసనును ఎస్‌ఐ ప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement