నమ్మించి..  నట్టేటముంచి   | Sakshi
Sakshi News home page

నమ్మించి..  నట్టేటముంచి  

Published Mon, Apr 16 2018 9:00 AM

Man Frauds Daily Labours For One Crore Rupees - Sakshi

శ్రీకాకుళం రూరల్‌ : వారంతా రోజువారీ కూలీలే. కష్టాన్ని నమ్ముకున్న నిరుపేదలే. దాచుకున్న సొమ్ముంతా ఊళ్లో ఉన్న నమ్మకస్తుడి చేతుల్లో పెట్టారు. మూడుంతలు చేసి ఇస్తామంటూ మాయమాటలు చెప్పి అందరినీ నమ్మించాడు. రూ.కోట్ల కొద్దీ కలెక్షన్లు రావడంతో కొద్దిరోజులకే మకాం మార్చేయడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. అధికారపార్టీ నేత సాయంతో విశాఖలో తలదాచుకున్న మాయగాడిని పట్టుకుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం తీసుకొచ్చారు.   

మండలంలోని కిష్టప్పపేట గ్రామానికి చెందిన కొర్ను రాజు తాపీమేస్త్రీగా చేసేవాడు. ఆయన వద్ద పనికి వచ్చే వారికి ‘పది రూపాయలు పెట్టుబడి పెట్టండి. దానికి మూడింతలు ఇస్తా’ అంటూ నమ్మబలికాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చీటిపాటలతో గ్రామస్తులందరినీ నమ్మించాడు. మూడు నెలల వరకూ సజావుగానే ఈ చీటీపాట నిర్వహించాడు. ఒకటి మూడు రెట్లు ఇస్తానని అందరికీ చెప్పడంతో స్థానికులేగాక చుట్టుపక్కల గ్రామాలైన కిష్టప్పపేట, మామిడివలస, సింగుపురం, బైరి గ్రామస్తులు కూడా తమ వద్ద ఉన్న డబ్బులను రాజు చేతిల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లా పెట్టేశారు. ఇలా 100 నుంచి 150 మంది వద్ద నుంచి సుమారు రూ.కోటి వసూలు చేసి.. ఏడాది క్రితం పరారయ్యాడు.

బ్యాంకులకు టోకరా
చదువు లేకపోయినా తనకున్న తెలివితేటలతో బ్యాంకులకే టోకరా వేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. 50 సెంట్లు భూమిని బ్యాంకుకు పద్దుపెట్టి రూ.లక్షల్లో లోను తీసుకున్నాడు. దీనిని కట్టేందుకు బ్యాంకు అధికారులకు చుక్కలు చూపించినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు ఆయన ఇంటిని వేలం వేయడంతో ఆ భూమిని మూడో వ్యక్తికి అమ్మి బ్యాంకు లోను కట్టినట్లు సమాచారం. దీంతో పాటు గ్రామంలోని మిగిలిన ఆస్తిపాస్తులు అమ్మి ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్నాడు.

మాటువేసి పట్టుకున్న గ్రామస్తులు
తన దగ్గర బంధువుతో విజయవాడలోని ఓ కనస్ట్రక్షన్‌  బిల్డింగ్‌ పనిలో రాజు తాపిమేస్త్రీగా చేరాడు. తరచూ భార్యతో ఫోన్‌లో మాట్లాడేవాడు. కిష్టప్పపేట గ్రామస్తులంతా వెళ్లి రాజు ఆచూకీ అడిగినా.. భార్య తెలీదంటూ సమాధానం చెప్పేదని బాధితులు తెలిపారు. ఒక దశలో వ్యక్తిగత పని మీద భార్య స్వస్థలమైన ఎచ్చెర్ల వచ్చేందుకు రాజు విజయవాడ నుంచి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న కిష్టప్పపేట గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ముందస్తుగా మాటువేసి రెండు రోజులు క్రితం పట్టుకుని రూరల్‌ పోలీసులకు అప్పగించారు. 

మాటమాటకో మార్పు
ఈ విషయం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. దీంతో బాధితులందరూ పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గంటగంటకో మాట చెబుతున్నట్లు సమాచారం. ఒకసారి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టానని.. ఇంకోసారి విశాఖలోని ఓ వ్యక్తి వద్ద రూ.25లక్షలు వడ్డీకి ఇచ్చానని పొంతలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. 

కొడుకు చదువు కోసం డబ్బులు దాచాను
నా కొడుకు చదువు నిమిత్తం రూ.90వేలు దాచిపెట్టా. గ్రామంలో అందరి ముందు నమ్మకంతో ఉండేవాడు. ఎక్కడికీ వెళ్లిపోడన్న ఆశతో ఆయన దగ్గరే దాచాను. ఇలా ముంచేస్తాడనుకోలేదు.
– గుండ సూర్యనారాయణ, కిష్టప్పపేట

కష్టమంతా చేతిలో పెట్టాను
కష్టపడిన సొమ్మంతా తాపీమేస్త్రి చేతిలో పెట్డా. ఆయన చెప్పిన మాటలే నమ్మాను. సుమారు రూ.లక్ష 50వేలు చిన్న కూతురి పెళ్లి కోసం దాచి పెట్టాను. ఇలా మోసం చేస్తాడనుకోలేదు.               
– కొరికాన మల్లమ్మ, కిష్టప్పపేట

అన్నింటిలోను మోసపోతున్నాం
మొన్న అగ్రిగోల్డ్‌లో లక్షలు కట్టి మోసపోయాం. ఇప్పుడు నమ్మకమైన వ్యక్తి చేతిలో పెట్టి మరింత అన్యాయానికి గురయ్యాం. పైసాపైసా కూడబెట్టి ఊళ్లో వ్యక్తి చేతిలో పెడితే ఇంత మోసం చేస్తాడనుకోలేదు. కూలీనాలీ చేసుకొని దాచుకున్న రూ.1.50లక్షలు కాజేశాడు.                           
– అరసవల్లి ఏకాసి, గ్రామస్తురాలు 

Advertisement

తప్పక చదవండి

Advertisement