వంచనతో ప్రేమా, పెళ్లి, హత్య..! | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కడతేర్చాడు

Published Sun, May 6 2018 7:00 AM

Man Murdered Wife Brutally In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌/ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ప్రేమించానన్నాడు..ఇదివరకే పెళ్లి అయి బాబు ఉన్నా ఫర్వాలేదని నమ్మించి పెళ్లి చేసుకొని అబ్బాయి జన్మనించిన తర్వాత కాదు పొమ్మని చెప్పి కోర్టులో కేసు నడుస్తుండగా అనుకున్న వూహ్యం ప్రకారం బండరాళ్లతో అతి కిరాతకంగా కటుకున్న భార్యను చంపిన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన అప్పాల స్వదేశ్‌–భాగ్యలక్ష్మి దంపతుల కుమారై ప్రియాంకకు 2012లో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన హరికృష్ణతో వివాహం జరిపించారు.

ఏడాదిపాటు సజావుగా సాగిన వీరి కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో వీరికి అబ్బాయి స్వాతిక్‌ జన్మించాడు. ఇద్దరి మధ్య మనస్ఫర్థలు ఏర్పడి విడాకులు తీసుకున్నారు. ప్రియాంక పుట్టింట్లో ఉంటూ 2014లో హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ కంప్యూటర్‌ సెంటర్‌లో ఇంగ్లి్లష్‌ కోచింగ్‌ తీసుకుంటున్న సమయంలో.. ఇదేమండలంలోని బోగంపాడ్‌ గ్రామానికి చెందిన కాసం దేవేందర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. తనకు గతంలోనే వివాహం జరిగిందని.. కుమారుడు ఉన్నట్లు తెలిపింది.

అయినా ఇద్దరు కలిసి హుజూరాబాద్‌ సమీపంలో ఉన్న కొత్తగట్టు ఆలయంలో 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అబ్బాయి జన్మించాడు. దేవేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లిని అంగీకరించకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి హన్మకొండలో కాపురం పెట్టించారు. కొద్దిరోజులు గడిచిన అనంతరం ఇరువురి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి.

అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.  శుక్రవారం పేషీ ఉండడంతో ఇరువురు కోర్టుకు హాజరు కాగా శనివారానికి వాయిదా వేశారు. శనివారం ఉదయం కోర్టుకు తన కుమారుడు సిరిన్‌తో కలిసి హాజరై ఇంటికి వస్తున్న క్రమంలో దేవేందర్‌రెడ్డి తన కుమారుడికి కూల్‌డ్రింక్‌ కొనిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి వచ్చిన ప్రియాంక కిరాణం షాపులో డబ్బులు కట్టి వస్తానని చెప్పి బయటకు వచ్చింది. ఈ తరుణంలో దేవేందర్‌రెడ్డి ప్రియాంక కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు స్ధానికులు తెలిపారు.

మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇల్లందకుంట శివారులోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ డీబీఎమ్‌ 16 కాలువ సమీపంలో దేవేందర్‌రెడ్డి ప్రియాంకను బండరాళ్లతో కొట్టి చంపేశాడు. అనంతరం నేరుగా హుజూరాబాద్‌ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకోసం జమ్మికుంటకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నారాయణ, ఎస్సై నరేశ్‌కుమార్‌ తెలిపారు.

కిరాతకంగా కొట్టి చంపాడు: అప్పాల స్వదేశ్‌
నాకూతురు ప్రియాంకను బయటకు పిలిచి అనుకున్న ప్రకారం ఎవరులేని ప్రదేశంలో బండలతో కొట్టి చంపేశాడని మృతురాలి తండ్రి స్వదేశ్‌ విలపిస్తూ తెలిపాడు. చంపుతానని, కాపురానికి తీసుకుపోనని గతంలో కూడా అన్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement