ప్రియురాలి మోజులో.. భార్యకు విషపు ఇంజెక్షన్‌

17 Jan, 2020 11:34 IST|Sakshi
భర్త వెంకటేశ్‌తో ఐజూరు పోలీసులు, మృతురాలు దీప (ఫైల్‌)

భార్యకు విషపు ఇంజెక్షన్‌ ఇచ్చి హత్య

 రామనగర తాలూకాలో ఘోరం  

దొడ్డబళ్లాపురం : ప్రియురాలిపై వ్యామోహంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన కిరాతక భర్తను రామనగర పోలీసులు అరెస్టు చేశారు. రామనగర ప్రభుత్వ ఆస్పత్రిలో రోజు కూలీ ఉద్యోగిగా పనిచేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్‌ వెంకటేశ్‌ (28) నిందితుడు. ఇతడు భార్య దీప (22)కు విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు... ఏడాది క్రితం రామనగర తాలూకా కొళమారనకుప్పె గ్రామానికి చెందిన దీపకు సమీప  వడ్డరదొడ్డివాసి వెంకటేశ్‌తో పెళ్లయింది. ఇతనికి అంతకుముందే ఆస్పత్రిలో పనిచేసే ఒక యువతితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తరువాత ఈ సంగతి తెలిసిన భార్య.. తన తల్లిదండ్రులకు చెబుతానని గొడవ చేసింది. ఈ విషయమై ఇద్దరికీ నిత్యం గలాటాల జరిగేవి. వెంకటేశ్‌ భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు.  

ప్రియురాలితో కలిసి కుట్ర  
తనకు, ప్రియురాలికి మధ్య అడ్డుగా ఉన్న దీపను అంతమొందించాలని అతడు పథకం వేశాడు. దాని ప్రకారం వెంకటేశ్‌ ప్రియురాలి సాయంతో కొన్ని మాత్రలు తీసికెళ్లి దీప చేత బలవంతంగా మింగించి ఆమె స్పహ తప్పాక ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స ఇప్పించాడు. ఆమె కోలుకున్నాక ఇంటికి తీసుకువచ్చి ఫర్టిలైజర్‌ దుకాణం నుంచి పురుగుల మందు తీసుకువచ్చి భార్యకు ఇంజెక్షన్‌ వేశాడు. విష ప్రభావంతో దీప మృతి చెందింది. అతడు ఏమీ ఎరగనట్టు ఆస్పత్రికి వచ్చి ఆరోగ్యం బాలేదని గ్లూకోజ్‌ పెట్టించుకుని అడ్మిట్‌ అయ్యాడు. ఆరోగ్యంగా ఉన్న దీప ఆకస్మాత్తుగా మరణించడంతో బంధుమిత్రుల్లో అనుమానాలు వచ్చాయి. పోలీసుల విచారణలో వెంకటేశ్‌ దురాగతం బయటపడింది. ప్రియుడు, ప్రియురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

                                 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు