తీసుకున్న డబ్బు ఇవ్వడం లేదని.. | Sakshi
Sakshi News home page

తీసుకున్న డబ్బు ఇవ్వడం లేదని..

Published Sun, Apr 28 2019 7:18 PM

Man Stabbed To Death In Hyderabad - Sakshi

యాకుత్‌పురా: తీసుకున్న డబ్బు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రవి కుమార్‌ తెలిపిన మేరకు..బార్కాస్‌ ఎర్రకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అమీర్‌ ఖాన్‌ ఆలియాస్‌ అమీర్‌ పఠాన్‌ (23) సంతోష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌. తలాబ్‌కట్టా భవానీనగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ షాహీద్‌ (21), సయ్యద్‌ ఆయాజ్‌ (28)లు ముగ్గురు స్నేహితులు. కొన్నేళ్లుగా వస్త్రాల వ్యాపారం చేస్తున్నారు.  రోజూ రోడ్లపై తిరుగుతూ విక్రయిస్తుంటారు.

విక్రయించిన అనంతరం ఆలిజాకోట్లాలోని జాఫ్రి గల్లీ పాన్‌షాపు వద్ద ప్రతి రోజు అర్ధరాత్రి కలుసుకుంటారు. ఇక నుంచి ఢిల్లీలోని తనకు తెలిసిన వారి వద్ద బట్టలు కొనుగోలు చేస్తామంటూ అమీర్‌..స్నేహితులు షాహీద్, ఆయాజ్‌లకు చెప్పాడు. దుస్తులు కొనుగోలు చేసేందుకు  ఆయాజ్‌ రూ.3 లక్షలు, షాహీద్‌ రూ.2 లక్షలను 20 రోజుల క్రితం అమీర్‌కు ఇచ్చారు. డబ్బు తీసుకొని బట్టలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్న అమీర్‌పై ఆయాజ్, షాహీద్‌లు కక్ష పెంచుకున్నారు. డబ్బులు తీసుకొని బట్టలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నావంటూ పలుమార్లు ఆయాజ్, షాహీద్‌లు అమీర్‌ ఖాన్‌ను మందలించారు. వీరి మధ్య డబ్బుల విషయమై గొడవలు జరిగాయి.

అమీర్‌పై కక్ష పెంచుకున్న షాహీద్, ఆయాజ్‌లు శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆలిజాకోట్లాకు చేరుకున్న అమీర్‌ ఖాన్‌తో గొడవ పడ్డారు. దీంతో వీరి మధ్య మాట మాట పెరగడంతో షాహీద్, ఆయాజ్‌లు తమ వద్ద ఉన్న కత్తులు, బండరాయితో అమీర్‌ ఖాన్‌పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న మొఘల్‌పురా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేసరికి అమీర్‌ మృతి చెంది ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులు సయ్యద్‌ షాహీద్, సయ్యద్‌ ఆయాజ్‌లను అరెస్ట్‌ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా హతుడు,నిందితులపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement