ఆ కళాశాలలో గంజాయి నిల్వలు?

29 Apr, 2019 11:22 IST|Sakshi

పోలీస్, ఎక్సైజ్‌ తనిఖీల్లో స్వాధీనం

పెదవి విప్పని అధికారులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో పేరు గాంచిన ఆ కళాశాలలో ఇన్నాళ్లూ బయటకు పొక్కని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సంపన్నుల పిల్లలు చదివే ఈ కళాశాలలో పాశ్చాత్య పోకడలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ర్యాగింగ్, మద్యపానం సేవించడం, డ్రగ్స్, గంజాయితో ఇక్కడ విద్యార్థులు పట్టుబడినా ఆ విద్యా సంస్థ పేరు మాత్రం బయటకు రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ జరిగిన అరాచకాలను సైతం మాఫీ చేసేశారు. ఇప్పుడు ఆ కార్పొరేట్‌ కళాశాలలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరడంతో పోలీసులు కూడా దృష్టిసారించారు. ఆదివారం సాయంత్రం పోలీసులు, ఎక్సైజ్‌ విభాగం అధికారులు  రుషికొండ సమీపంలోని కళాశాలకు చెందిన హాస్టల్‌లో తనిఖీలు చేపట్టి విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకొన్నట్లు తెలుస్తోంది. ఆ కళాశాల యాజమాన్యం అధికార పార్టీ ద్దలకు అత్యంత సన్నిహితులు కావడంతో పోలీసులు, ఎక్సైజ్‌ విభాగం అధికారులు దీనిపై పెదవి విప్పడం లేదు.

ఈ విషయంపై మాట్లాడేందుకు సైతం నిరాకరిస్తున్నారు. అయితే గంజాయి పట్టబడటం వాస్తవమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల రుషికొండ ప్రాంతంలో రేవ్‌ పార్టీలు నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన తనిఖీల్లో విద్యార్థుల నుంచి గంజాయి పెద్ద మొత్తంలో లభించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు