అత్తింటి వేధింపులకు వివాహిత బలి | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

Published Thu, Jul 5 2018 11:19 AM

Marriage Dowry Harassment Women Suicide Karimnagar - Sakshi

జగిత్యాలక్రైం: అత్తింటి వేధింపులకు వివాహిత బలైంది. జగిత్యాల మండలం మోరపల్లి గ్రామానికి చెందిన గూడ మానస (22) బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం... సారంగాపూర్‌ మండలం అర్పపల్లి గ్రామా నికి  చెందిన గన్ను వెంకట్‌రెడ్డి– లక్ష్మి కూతురు మానసను జగిత్యాల మండలం మోరపల్లి గ్రామానికి చెందిన గూడ హన్మండ్లు– గంగవ్వల కొడుకు రాకేశ్‌కు ఇచ్చి రెండు సంవత్సరాల క్రితం వివా హం చేశారు. ఆ సమయంలో రూ.3లక్షల కట్నం, ఇతర లాంఛనాలు అప్పగించారు. రాకేశ్‌ వ్యవసాయం చేస్తుంటాడు.

కొద్దికాలం వీరికాపురం సజావుగానే సాగింది. కొద్ది రోజుల క్రితం మానసకు రాకేశ్‌ తల్లికి గొడవ జరిగింది. అప్పటి నుంచి గ్రామంలోనే వేరుకాపురం పెట్టారు. కాగా మూడు నెలల నుంచి మరో రూ.10 లక్షలు అదనపు కట్నం తేవాలని రాకేశ్‌ మానసను వేధిస్తున్నాడు. బుధవారం రాకేశ్‌ బయటకు వెళ్లాడు. ఉదయం 11 గంటల తరువాత మానస ఇంట్లో ఉరి వేసుకుంది. రాకేశ్‌ వచ్చి చూసేసరికి తలుపులు వేసుకుని దూలానికి వేలాడుతోంది. వెంటనే తలుపులు పగులగొట్టి మానసను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు పరీక్షించేలోపే మృతిచెందింది.

విషయం తెలుసుకున్న మానస కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి రాకేశ్, తల్లి గంగవ్వపై దాడిచేశారు. దీంతో అక్కడే ఉన్న రూరల్‌ సీఐ రాజేశ్‌ వారిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మానస మృతికి కారకులైన  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేయడంతో డీఎస్పీ భద్రయ్య ఆస్పత్రికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యుల  ఫిర్యాదు మేరకు అందరిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతి ంచారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మానస కుటుం బ సభ్యులను పరామర్శించారు.
 
విచారణ చేపట్టిన పోలీసులు 
మోరపల్లి గ్రామంలో ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ గూడ మానస మృతికి అత్తింటి వారే కారణమని ఫిర్యాదు చేయగా రూరల్‌ సీఐ రాజేశ్, ఎస్సై కిరణ్‌కుమార్‌లు మోరపల్లి గ్రామానికి చేరుకొని ఉరి వేసుకున్న గదిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతురాలి భర్త రాకేశ్, అత్త గంగవ్వ, ఆడబిడ్డ లావణ్య, రాకేశ్‌ స్నేహితుడు గాజంగి రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
 
అర్పపల్లిలో అంత్యక్రియలు 
మానస ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో అత్తింటి వారు ఎవరు కూడ మృతదేహం వద్దకు రావొద్దని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిగారి స్వగ్రామం అర్పపల్లికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 

అదనపు కట్నం కేసు నమోదు
హుజూరాబాద్‌రూరల్‌ : మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన బాణాల భవాని తన భర్త కృష్ణమూర్తి, అత్త మామలు, ఆడబిడ్డలు అదనపు కట్నం తీసుకరావాలంటూ ఆరేళ్లుగా వేధిస్తున్నట్లు తెలిపింది. వేధింపులు భరించలేక బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు  కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ పి.దామోదర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement