అమ్మా.. డాడీని మర్చిపోమ్మా.. | Sakshi
Sakshi News home page

అమ్మా.. డాడీని మర్చిపోమ్మా, విడాకులిచ్చేయ్‌

Published Thu, Jul 23 2020 11:11 AM

Married Woman Strike In Front Of Police Station - Sakshi

తిరుపతి క్రైమ్‌: భార్య, కుమార్తె ఉండగానే మరో మహిళను గుట్టు చప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకొన్నాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన తిరుపతి పెద్ద కాపు వీధిలో జరిగింది. మొదటి భార్య సరస్వతిని భర్త వెంకట చలపతి ఇంటి నుంచి గెంటి వేసాడు. దీంతో సరస్వతి తన కుమారైతో కలసి న్యాయం చేయాలంటూ ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌ ఎదుట రోడ్డు మీద బైఠాయించింది.

బాధితురాలు, పోలీసుల కథనం.. స్థానిక పెద్దకాపు వీధిలో ఉన్న వెంకట చలపతితో 13 ఏళ్ల క్రితం సరస్వతికి వివాహమైంది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి 6 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ నేపథ్యంతో తన భర్త గుట్టుగా రెండో వివాహం చేసుకున్నాడని సరస్వతి తెలుసుకుంది. అప్పటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు తలెత్తేవి. ఈ క్రమంలో వెంకట చలపతి రెండో భార్య బంధువులు అందరూ సరస్వతిని కలిసి కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు. దీనిపై ఆమె ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించగా అక్కడే ఉన్న మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

ఆమె వారి వద్దకు వెళ్లకుండా స్టేషన్‌ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద తన కుమార్తెతో కలిసి బైఠాయించి న్యాయం చేయాలంటూ బోరున విలపించసాగింది. ఈస్ట్‌ స్టేషన్‌ ఎస్‌ఐ జయచంద్ర అక్కడికి చేరుకుని మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రెండో భార్యతో ఆమె భర్త బైక్‌పై పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నాడు. ఇది చూసిన సరస్వతి ఆగ్రహంతో ఊగిపోయింది. పరుగున భర్త వద్దకు వెళ్లి లాగే ప్రయత్నం చేసింది. రెండో భార్య మాత్రం ప్రేక్షకురాలైంది. సరస్వతి బైక్‌ తాళం లాక్కునేందుకు యత్నించేసరికి వెంకట చలపతి అక్కడి నుంచి రెండో భార్యతో ఉడాయించాడు. చివరకు మహిళా కానిస్టేబుల్‌ సహాయంతో మహిళా పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

అమ్మా... డాడీని మర్చిపోమ్మా..

తండ్రిని పోలీస్‌ స్టేషన్‌ దగ్గర చూసిన ఆ చిన్నారి తల్లితో కలిసి... అతడి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిందిడాడీ మా పక్కకు రా డాడీ... అంటూ  భోరున విలపించినా తండ్రి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు తల్లి నడిరోడ్డుపై ఏడుస్తుండటంతో ...ఆ చిన్నారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ... అమ్మా డాడీని మర్చిపోమ్మా, నాకు డాడీ వద్దు, ఆయన మీద కేసు వేసి విడాకులు ఇచ్చేయ్‌. నాకు ఇంకా డాడీ లేడు.. నువ్వు ఏడవొద్దమ్మా’ అంటూ తల్లిని ఓదార్చింది.  

Advertisement
Advertisement