మాయని మచ్చ! | Sakshi
Sakshi News home page

మాయని మచ్చ!

Published Fri, Mar 9 2018 9:09 AM

Married Woman Suicide On Extra Dowry Harrassments - Sakshi

ఊరంతా మహిళా దినోత్సవం జరుపుకుంటుంటే.. ఓ వివాహిత మాత్రం అర్ధంతరంగా తనువు చాలించింది. మహిళల భద్రత, గృహ హింస, చట్టాలు అంటూ వేదికలెక్కి గొప్పగా చెబుతున్నా.. మరోవైపు వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళలు సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. కేవలం అదనపు కట్నం కోసం అత్తింటి వారు తరచూ భౌతిక దాడులు, మానసిక వేధింపులు చేస్తుండడంతో భరించలేని గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది.

ఆత్మకూరు: అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయితే అది హత్య అని పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన నరసింహులు ఇద్దరు సంతానం. తన కుమార్తె నాగేంద్రమ్మ(22)ను తొమ్మిది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన శివకు ఇచ్చి వివాహం జరిపించారు. ఐదు నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది.

వేధిస్తున్నారు.. నాన్న
ఈ నేపథ్యంలోనే నాగేంద్రమ్మ గర్భం దాల్చింది. మూడు నెలలుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త శివతో పాటు అతని అన్న పోతులయ్య, తల్లి (నాగేంద్రమ్మ అత్త) లింగమ్మ వేధింపులు మొదలు పెట్టారు. ఇదే విషయమై పలుమార్లు తండ్రి వద్ద నాగేంద్రమ్మ వాపోయింది. ‘నాన్న.. డబ్బు కావాలంటూ మా ఆయనతో పాటు అత్త, బావ రోజు నన్ను మాటలతో కాల్చుకు తింటున్నారు’ అంటూ కన్న తండ్రి ఎదుట ఆమె బోరుమంది. గర్భణి అని కూడా చూడకుండా భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారంటూ కన్నీటి పర్యంతమైంది.

ఉరి వేసుకుని..
వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో నాగేంద్రమ్మ తాళలేకపోయింది. చివరకు ఆత్మహత్య ఒక్కటే మార్గంగా ఆమె భావించింది. ఈ నెల 6న కూడేరులోని ఆస్పత్రిలో వైద్య చికిత్సల కోసం నాగేంద్రమ్మను పిలుచుకెళ్లారు. గురువారం ఉదయం ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్‌ చేయడంతో నరసింహులు అక్కడకు చేరుకుని  పరిశీలించాడు.

హతమార్చారు..
తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదంటూ ఈ సందర్భంగా నరసింహులు కన్నీటి పర్యంతమయ్యాడు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ తరచూ తన వద్ద బాధపడుతుండేదని తెలిపారు. పరిస్థితి అనుకూలంగా లేదని కొంత కాలం ఆగితే కొద్దోగొప్పో డబ్బు సర్దుతానంటూ చెప్పుకొచ్చినట్లు వివరించారు. ఇంతలో అత్తింటి వారు ఇంతటి దురాగతానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement