ఐటీఐ పరీక్షల్లో...మాస్‌ కాపీయింగ్‌ | Sakshi
Sakshi News home page

ఐటీఐ పరీక్షల్లో...మాస్‌ కాపీయింగ్‌

Published Tue, Jan 23 2018 10:10 AM

mass copying in ITI exams - Sakshi

అసలు కళాశాల క్లాసులకు రాకుండానే పరీక్షలకు హాజరు కావచ్చు... ఒకవేళ పరీక్షలు రాసే తీరిక కూడా లేకపోయినా మీ స్థానంలో వేరే వారితో పరీక్ష రాయించేస్తారు. ఒకే రోజు మూడు రోజుల పేపర్లు రాసేసుకోవచ్చు... దీనికంతటికి మీరు చేయాల్సిందేమిటంటే.. వారు అడిగినంత చెల్లించడమే. జిల్లాలోని పలు ఐటీఐ కళాశాలల్లో పరీక్షలు జరుగుతున్న తీరు ఇది.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : సోమవారం ఐటీఐ మొదటి సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్, రెండో సంవత్సరం విద్యార్థులకు మూడో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఆన్సర్లు, ప్రాక్టికల్స్‌ అన్నీ బోర్డు మీద ఇన్‌స్ట్రక్టర్లు రాస్తుంటే విద్యార్థులు చూసి ఎక్కించేసుకున్నారు. వీరికి 90 నుంచి 95 శాతం మార్కులు గ్యారెంటీ. గణపవరం, నిడమర్రు మండలం బువ్వనపల్లి, ఉంగుటూరు మండలం చేబ్రోలు, తణుకులలో ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఒక్కో దానిలో 300 మంది వరకూ చదువుతున్నట్లు లెక్కల్లో ఉంటుంది. కళాశాలకు హాజరయ్యే వారి సంఖ్య 50కి మించదు. కళాశాలలో ఫర్నీచర్‌ కూడా 50 నుంచి 60 మందికి సరిపడా మాత్రమే ఉంటుంది. పరీక్షల సమయంలో వేరేచోటి నుంచి తీసుకువచ్చి వేస్తారు. ఐటీఐ అంటే ప్రతి రోజూ కళాశాలకు వెళ్లాలి. ప్రాక్టికల్స్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇదెక్కడా అమలు కాదు. ఇక్కడ జిల్లా నుంచే కాకుండా కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వచ్చి చేరే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఓసీ విద్యార్థుల వద్ద నుంచి ఫీజు వసూలు చేసినా, బీసీ, ఇతర వెనుకబడిన కులాల విద్యార్థులకు వచ్చే స్కాలర్‌షిప్‌లతో కళాశాలలను నడిపేస్తున్నారు.

కళాశాలకు రాని విద్యార్థుల పేరుతో వీరు స్కాలర్‌షిప్స్‌ పెడుతున్నారు. ఈ విద్యార్ధుల బ్యాంకు పుస్తకాలు కూడా  కళాశాల ప్రిన్సిపల్‌ వద్దే ఉంటున్నాయి. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు బ్యాంకులో క్రెడిట్‌ అయినప్పుడు విద్యార్థిని బ్యాంకుకు తీసుకువెళ్లి విత్‌డ్రా చేయించి వారు తీసుకుంటారు. కళాశాలకు విద్యార్థులు రాకపోయినా రోజూ వచ్చినట్లుగా అటెండెన్స్‌లో చూపిస్తుంటారు. ఒక్కో సెమిస్టర్‌ పరీక్షకు ఐదు వేల రూపాయల చొప్పున విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి కూడా సరైన క్వాలిఫికేషన్‌ ఉండదు. వీరే ఇన్విజిలేటర్లుగా ఉంటారు. నిడమర్రు మండలంలోని ఐటీఐలో గణపవరం జెడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేసే ఉపాధ్యాయుడే బోధన చేస్తుంటారు. తాను పనిచేసే స్కూల్‌లో బయోమెట్రిక్‌ వేసి ఇక్కడ ఉద్యోగం చేస్తుంటారు. పరీక్షలకు రాని విద్యార్థుల పేరుతో వేరేవారు పరీక్షలు రాస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇక్కడ సీసీ కెమేరాలు పెట్టినా ఎక్కడా అవి పనిచేయడం లేదు. మూడు రోజులు జరగాల్సిన పరీక్షలు ఒకేరోజున ఏకబిగిన రాయించేశారు.

ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ మూడు పరీక్షలు రాయించేశారు. ఆన్సర్లు, ప్రాక్టికల్స్‌ ఇన్విజిలేటర్లు బోర్డుపైన రాస్తుంటే విద్యార్థులు చూసి ఎక్కించేశారు. రాసేవారికి ఎన్నిమార్కులకు సబ్జెక్టులు ఉంటాయో తెలియని పరిస్థితి. అయితే పరీక్షా ఫలితాలలో ప్రతి ఒక్కరికి 90 నుంచి 95 శాతం రిజల్ట్‌ తగ్గకుండా వచ్చేలా చూస్తారు. అసలు పరీక్షకే హాజరు కాని వారి వద్ద రూ.50 వేలు తీసుకుని వేరేవారితో పరీక్షలు రాయిస్తున్నట్లు సమాచారం. పరీక్షల సమయంలో హాజరయ్యే ఇన్విజలేటర్, స్క్వాడ్‌కు రోజుకు పది వేల రూపాయల చొప్పున ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టైంటేబుల్‌ ప్రకారం రేపు పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ పరీక్ష ఇవాళే జరిపేయడంతో రేపు పరీక్ష లేదని విద్యార్థులకు చెప్పారు. పరీక్షల్లో జరుగుతున్న మాస్‌ కాపీయింగ్‌కు సంబంధించిన ఆధారాలు ‘సాక్షి’ సంపాదించింది.

Advertisement
Advertisement