ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది సజీవ దహనం | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 29 2017 8:14 AM

Massive Fire in Mumbai Kamala Mills Building - Sakshi

సాక్షి, ముంబై : భారీ అగ్నిప్రమాదంతో దేశ ఆర్థిక రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గురువారం అర్థరాత్రి నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్‌ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 15 మంది సజీవ దహనం అయినట్లు సమాచారం. క్షతగాత్రుల సంఖ్య సరిగ్గా తెలీనప్పటికీ వారందరిని కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌(కేఈఎం) ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయిస్తున్నారు.

ఇక కాంపౌండ్‌లో పలు ఇళ్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. మృతుల్లో 12 మంది  మహిళలే ఉన్నారు. రాత్రి 12.27 గంటల సమయంలో ఘటన గురించి తమకు సమాచారం అందిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. హుటాహుటిన 8 శకటాలు అక్కడికి చేరుకున్నట్లు వారు తెలిపారు. ముందు కమలా ట్రేడ్ హౌస్‌లోని రెస్టారెంట్‌ 1లో తొలుత మంటలు చెలరేగి.. చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయని అధికారులు వివరించారు.

కాగా, ఇదే కాంపౌండ్‌లో పలు మీడియా హౌస్‌లు కూడా ఉన్నాయి. దీంతో దీనిని ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్టులు మాట్లాడుతూ రెస్టారెంట్‌లో  చెలరేగిన మంటలు వేగంగా విస్తరించాయని, దానికి ఆనుకుని ఉన్న డిన్నర్ కమ్ పబ్‌లకు వ్యాపించాయని తెలిపారు. చానళ్లకు సంబంధించిన కొంత సామగ్రి కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Advertisement
Advertisement