అడ్డుకునే వారెవరు? | Sakshi
Sakshi News home page

అడ్డుకునే వారెవరు?

Published Sat, Apr 7 2018 8:05 AM

Matka Gang Arrest - Sakshi

తాడిపత్రిలో రాజకీయ అండదండలతో మట్కా జోరందుకుంది. ఒకప్పుడు చీకటిమాటున సాగిన మట్కా.. నేడు బహిరంగంగా కొనసాగుతోంది. సులువుగా డబ్బు సంపాదించొచ్చంటూ అమాయకులను ఉచ్చులోకి దింపి వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. అరికట్టాల్సిన పోలీసులు నిర్వాహకులను వదిలి పొట్టకూటి కోసం బీటర్లుగా అవతారమెత్తిన వారిపై ప్రతాపం చూపుతున్నారు.   

తాడిపత్రి: తాడిపత్రి కేంద్రంగా మట్కా సాగుతోంది. నిర్వాహకులు మాఫియాగా ఏర్పడ్డారు. వీరికి రాజకీయ అండదండలతోపాటు పోలీసుల సహకారమూ ఉండటంతో మట్కా కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ 12 నుంచి ఇప్పటి వరకు  దాడులు చేసినప్పటికీ చిన్నా చితక బీటర్లను అదుపులోకి తీసుకున్నారే కానీ నిర్వాహకులను అరెస్ట్‌ చేయలేదు. మట్కా మహమ్మారిని కూకటి వేళ్లతో నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. 

నిఘా పక్కదారి
అసాంఘిక కార్యకలాపాలను ముందస్తుగా పసిగట్టి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి చేరవేయాల్సిన ఐడీ పార్టీ సిబ్బంది తప్పుడు సమాచారంతో పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐడీ పార్టీలోని కొంత మంది సిబ్బందికి పట్టణంలోని మట్కా నిర్వాహకులతో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మట్కా కంపెనీలు చెప్పినట్లు విని పోలీసు అధికారుల దృష్టి మట్కా నిర్వాహకులపై మళ్లకుండా ఉండేందుకు చిన్నాచితకా బీటర్ల సమాచారాన్ని మాత్రమే చేరవేస్తున్నట్లు సమాచారం. 

నిర్వాహకులపై చర్యలేవీ?
రాజకీయ అండదండలు లేని తమపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారని బీటర్లు వాపోతున్నారు. తాడిపత్రి ప్రాంతంలో ఎవరు ఎక్కడ  మట్కా కంపెనీలు నిర్వహిస్తున్నారన్న విషయం ప్రతి కానిస్టేబుల్‌కూ తెలిసినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. అసలైన నిర్వాహకులను అరెస్టు చేస్తే బీటర్లు చీటీలు రాసేందుకు అవకాశమే ఉండదని పలువురు బీటర్లు అంటున్నారు.

Advertisement
Advertisement