మరో మెడికో ఆత్మహత్య  | Sakshi
Sakshi News home page

మరో మెడికో ఆత్మహత్య 

Published Mon, Aug 13 2018 4:16 AM

Medico Suicide in the SV Medical College - Sakshi

తిరుపతి అర్బన్‌: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం రాత్రి తిరుపతిలో చోటుచేసుకున్న ఈ ఘటన తిరుపతిలో సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే..  వైఎస్సార్‌ జిల్లా కడప నగరంలోని మారుతీనగర్‌కు చెందిన హరితాదేవి తన కుమార్తె గీతికతో కలిసి తిరుపతి శివజ్యోతినగర్‌లో ఉంటున్నారు. గీతిక ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సోమవారం కాలేజీలో పాథాలజీ ఇంటర్నల్‌ పరీక్ష హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఎప్పటిలాగే ఇంట్లో భోజనం చేశాక గదిలోకి వెళ్లి చదువుకునేందుకు తలుపు వేసుకుందని ఆమె తల్లి హరితాదేవి తెలిపారు. కానీ, సాయంత్రం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం కలిగి తలుపు తీసి చూస్తే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.

కొన ఊపిరితో ఉన్న ఆమెను హుటాహుటిన 108 వాహనంలో రుయా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందిందన్నారు. గీతిక మృతికి కారణాలు తెలియలేదు. కానీ, తమ కుమార్తె వ్యక్తిగత కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని హరితాదేవి తెలిపారు. కాగా, గీతిక తండ్రి వైఎస్సార్‌ కడప జిల్లాలో న్యాయవాదిగా పనిచేస్తూ రెండేళ్ల క్రితమే మృతిచెందారు. తల్లి హరితాదేవి కూడా కడపలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవారు. అయితే, కుమార్తె మెడిసిన్‌ చదువు కోసమని రెండేళ్ల క్రితం టీచర్‌ వృత్తిని వదులుకుని తిరుపతిలో ఉంటున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గీతిక మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. 

వైద్య విద్యార్థుల దిగ్భ్రాంతి 
గీతిక ఆత్మహత్యతో వైద్య వర్గాలు, వైద్య విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మృతి వార్త తెలుసుకుని నిర్ఘాంతపోయామని ప్రభుత్వ వైద్యుల సంఘం, జూనియర్‌ డాక్టర్ల సంఘం నేతలు శ్రీనివాసరావు, వెంకటరమణ, లావణ్య తెలిపారు. గీతిక మృతదేహాన్ని సందర్శించి హరితాదేవిని పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం తిరుపతి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, నాయకులు కిశోర్, దాస్, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, డీవైఎఫ్‌ఐ నాయకులు రుయాకు చేరుకుని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిద్ధానాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే పేద విద్యార్థుల వరుస ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే.. కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న గీతిక మృతదేహాన్ని పరిశీలించారు. 

Advertisement
Advertisement