‘చంపేస్తావా ఏంటి.. మర్యాదగా మాట్లాడు’ | Sakshi
Sakshi News home page

‘మమ్మల్ని చంపేయొచ్చుగా... మర్యాదగా మాట్లాడు’

Published Thu, Oct 31 2019 2:20 PM

UP Men Allegedly Stop Dalit Women Tries To Entering Temple Video Goes Viral - Sakshi

లక్నో : దళితులమైన కారణంగా తమను గుడిలో ప్రవేశించకుండా అడ్డుకున్నారంటూ కొంతమంది మహిళలు ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమతో దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అక్టోబరు 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. వివరాలు... బులంద్‌షహర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న ప్రముఖ ఆలయంలోకి వెళ్లేందుకు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మహిళలు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఇద్దరు అగ్ర కులస్తులు వారిని అడ్డుకున్నారు. గుడిలోకి రానిచ్చేది లేదంటూ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఈ క్రమంలో బాధిత బృందంలో ఉన్న ఓ మహిళ ఘటనకు సంబంధించిన వీడియోను చిత్రీకరించారు. ‘మమ్మల్ని చంపేస్తారా ఏంటి? అయినా ఇది దేవాలయం. అందరూ ఇక్కడ పూజలు చేస్తారు. మీరెంతగా భయపెట్టినా ఇక్కడ నుంచి కదిలేది లేదు. మీ బలగాన్నంతా తెచ్చుకోండి. అప్పుడు చూద్దాం. ఎవరి సత్తా ఏంటో అంటూ మహిళలు సదరు వ్యక్తులకు గట్టి సమాధానమిచ్చారు. దీంతో తొలుత కులం పేరుతో దూషించిన సదరు వ్యక్తి ఆ తర్వాత.. ‘ నేను మిమ్మల్ని ఎందుకు భయపెడతాను? ఎందుకు కొడతాను? ఇది ఠాకూర్లకు చెందిన ఆలయం. ఇక్కడ ఠాకూర్లు, బ్రాహ్మణులు మాత్రమే పూజ చేస్తారు. మీరు మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది’ అంటూ మాట మార్చాడు. అయినప్పటికీ గుడికి తాళం వేసి వాళ్లను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వాల్మీకి సామాజికవర్గ నాయకుడు విజేందర్‌ సింగ్‌ వాల్మీకి, బాధిత మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా విజేందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘ఇంకెంత కాలం ఈ వివక్ష కొనసాగుతుంది. ఇప్పటికైనా అగ్ర కులస్తులు పంథా మార్చుకోవాలి. వాళ్లు మమ్మల్ని హిందుత్వం నుంచి దూరం చేయాలని చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement