Sakshi News home page

వీడని మిస్టరీ

Published Mon, Feb 11 2019 8:16 AM

Merchant Murali Krishna Murder Mystery Still Pending - Sakshi

విజయనగరం , పార్వతీపురం : ఎంతటి కేసునైనా తమ డేగకళ్లతో పసిగట్టి  హంతకులను పట్టుకుంటారనేది పోలీసుశాఖకు ఉన్న పేరు. తీగ లాగితే డొంక కదిలినట్లు  ఏదో ఒక ఆధారం ద్వారా కేసును ఛేదించడం పోలీసులకు అలవాటే. సంఘటనా స్థలంలో లభించే చిన్నపాటి ఆధారాలతో పెద్ద పెద్ద కేసులను పోలీసులు చాకచక్యంగా ఛేదించే సందర్భాలు కోకొల్లలు. ఒక్కోసారి కేసుకు సంబంధించిన ఆధారాలు స్థానిక పోలీసులకు లభించని సమయంలో సీసీఎస్‌ పోలీసుల సహకారం తీసుకుంటారు. వీరు రంగప్రవేశం చేసిన తర్వాత ఎంతటి కేసునైనా ఏదో ఒక ఆధారంతో కొలిక్కి తీసుకువచ్చి నేరస్తులను పట్టుకుంటారు. అయితే పార్వతీపురంలో 2017 జూలై 22న జరిగిన వ్యాపారి మురళీకృహత్య కేసు నేటికీ కొలిక్కిరాలేదు.

ఇలాంటి సంఘటనే పక్క మండలమైన బొబ్బిలిలో జరిగితే వారం రోజుల్లో నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు మురళీకృష్ణను చంపిన హంతకులను పట్టుకోలేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతంగా ఉండే పార్వతీపురం పట్టణంలో మొట్టమొదటిసారిగా తుపాకీ గుళ్లకు ఒక వ్యాపారి బలికావడం పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఎన్నడూ లేనిది తుపాకీ సంస్కృతి పార్వతీపురంలో మొదలు కావడంతో ఇదే చివరది కావాలని.. నేరస్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పట్టణ ప్రజలంతా వేయకళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ 19 నెలలు పూర్తవుతున్నా నేటికీ వ్యాపారి మురళీకృష్ణ హత్యకు సంబంధించి ఒక్క క్లూ కూడా సంపాదించకపోవడం.. నేరస్తులను పట్టుకోకపోవడంతో పోలీ సులపై ఉన్న నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లుతోంది. జిల్లాకు కొత్త ఎస్పీ, పార్వతీపురానికి కొత్త ఏఎస్పీ వచ్చారు. వీరి సారథ్యంలోనైనా పోలీసులు కేసును ఛేదిస్తారామే చూడాలి.

అనుమానాలెన్నో..
మురళీకృష్ణ హత్యకు సంబంధించి సర్వత్రా అనేక విమర్శలతో పాటు అనుమానాలు కూడా ప్రజల్లో నెలకొన్నాయి. పోలీసులు తలుచుకుంటే ఛేదించలేని కేసంటూచేదీ ఉడదని, కానీ మురళీకృష్ణ్ణ కేసును ఛేదించకపోవడం వెనుక ఏదో ఒక కారణం ఉండి ఉంటుం దని పట్టణ ప్రజలు అనుమానిస్తున్నారు. మృతు డు మురళీకృష్ణ్ణ భార్య  పోలీసులను ఆశ్రయించకుండా మౌనంగా ఉండడం వెనుక ఏదో ఒత్తిడి ఉండివచ్చన్న అనుమానులను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయనంత మాత్రాన, కుటుంబ సభ్యులు సహకరించనంత మాత్రాన జరిగింది హత్య కాదా.. నేరస్తులను పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో ఒక హత్య కేసు ఛేదించడం ఏమంత కష్టం కాదని.. ఇప్పటికైనా పోలీసులు స్పందించి కేసును ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement