ఫేస్‌బుక్‌ పరిచయం కొంప ముంచింది  | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ పరిచయం కొంప ముంచింది 

Published Tue, Apr 23 2019 4:46 AM

Molestation Attack On Married Women From Three Months - Sakshi

సాక్షి,గుంటూరు: ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వ్యక్తి చివరకు తన కొంప ముంచాడంటూ ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. గుంటూరులో సోమవారం నిర్వహించిన పోలీస్‌ గ్రీవెన్స్‌కు వచ్చిన బాధితురాలు అర్బన్‌ ఏఎస్పీ వైటీ నాయుడును కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అదే మండలంలోని కంతేరు గ్రామానికి చెందిన బేతాల రాజేష్‌ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆరు నెలల క్రితం ఆ వివాహిత ఫేస్‌బుక్‌ అకౌంట్‌కు హాయ్‌ అని సందేశం పంపాడు. తాను క్లాస్‌మేట్‌నంటూ పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ వివాహిత అతనితో చాటింగ్‌ ప్రారంభించింది. అనంతరం ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఉన్న ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఆమెకు ఫోన్‌చేసి పరిచయం పెంచుకున్నాడు. అతడు బలవంతం చేయడంతో వ్యక్తిగత ఫొటోలను వాట్సాప్‌లో పంపించింది.

ఆ తరువాత వాటిని సాకుగా చూపుతూ.. తనతో శారీరక సంబంధానికి అంగీకరించాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. గత్యంతరం లేని స్థితిలో ఆమె అంగీకరించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మూడు నెలల క్రితం రూ.12 లక్షల నగదు, బంగారు గొలుసు తీసుకుని రాజేష్‌తో వెళ్లింది. మంగళగిరిలోని గుర్తు తెలియని ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న రాజేష్‌ ఆమెతో కాపురం పెట్టాడు. తాను బయటకు వెళ్లాల్సి వస్తే ఆమెను గదిలో ఉంచి తాళం వేసి వెళ్లేవాడు. ఈ క్రమంలో భర్తతో విడాకులు వచ్చాయని ఆమెను నమ్మించి గతేడాది డిసెంబర్‌లో విజయవాడలోని గుణదల ఆలయంలో వివాహం చేసుకున్నాడు. క్రమంగా డబ్బు, బంగారం మొత్తం తీసేసుకున్న రాజేష్‌ తరచూ వేరే యువతులతో ఫోన్లు మాట్లాడటాన్ని ఆమె గమనించింది. నిలదీస్తే చంపడమో, వ్యభిచార కూపానికి తరలించడమో చేస్తాడని భయపడింది.

ఈ నెల 14న అతని చెర నుంచి తప్పించుకుని పుట్టింటికి చేరుకుని.. తనకు జరిగిన అన్యాయంపై పెద్దకాకాని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న రాజేష్‌ ఈనెల 21న రాత్రి వివాహిత పుట్టింటికి వెళ్లాడు. తనతో రాకుంటే ఆమె కుటుంబాన్ని హతమారుస్తానని హెచ్చరించాడు. అతడి నుంచి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించి, అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వివాహిత పోలీసులను కోరింది.  

Advertisement
Advertisement