సునీల్‌ దొరికాడు | Sakshi
Sakshi News home page

సునీల్‌ దొరికాడు

Published Fri, Apr 6 2018 12:49 PM

Most Wanted Gangster Sunil Kumar Arrest - Sakshi

కడప అర్బన్‌ :మోస్ట్‌ వాంటెండ్‌ గ్యాంగ్‌స్టర్, జీవితఖైదు పడిన మండ్ల సునీల్‌కుమార్‌ అలియాస్‌ సునీల్‌ ఆటో డ్రైవర్‌ నుంచి మోస్ట్‌ వాంటెండ్‌ గ్యాంగ్‌స్టర్‌ దాకా ఎదిగి ప్రజల జీవనానికి ఆటంకం కలిగించేవాడు. అడ్డదారిలో డబ్బులు సంపాదిస్తూ జల్సాలకు పాల్పడేవాడు. ఇంటర్, ఇంజినీరింగ్‌ విద్యార్థులే లక్ష్యంగా వారిని ఆకట్టుకుని డబ్బులు, మద్యం, మగువలను ఎరగా వేసి గ్యాంగులుగా తీర్చిదిద్దాడు. 2010 నుంచి ఇప్పటిదాకా సునీల్‌కుమార్‌పై నాలుగు జిల్లాల్లో దాదాపు 19 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో  వైఎస్సార్‌ జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 13 కేసులు, అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో మూడు కేసులు, కృష్ణా జిల్లాలో ఒక కేసు నమోదైంది.

ఇదీ సునీల్‌ నేర చరిత్ర
ప్రొద్దుటూరు పట్టణ నివాసి మండ్ల సునీల్‌కుమార్‌ ఐదేళ్ల కిందట 150 నుంచి 200 మంది యువతను ప్రలోభాలతో చెడుదారి పట్టించి తన ఆధీనంలో గ్యాంగ్‌ను నడిపాడు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు, చీటింగ్‌లు, అక్రమ ఆయుధాల కేసులు లాంటి నేరాలకు పాల్పడి ఇప్పటివరకు 19 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల అనంతపురం జిల్లా నార్పల కిడ్నాప్‌ కేసుకు సంబంధించి జీవితఖైదు విధించారు. కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. 2014లో ఒకసారి కడప సెంట్రల్‌ జైలులోకి వెళుతూ అనంతపురం నుంచి వచ్చిన ఎస్కార్టు పోలీసుల కళ్లు గప్పి పారిపోయి కృష్ణా జిల్లా పోలీసులకు పట్టుబడ్డాడు. గతనెల 27వ తేదీన కర్నూలులో కోర్టు వాయిదాకు వెళ్లిన సునీల్‌కుమార్‌ను వాయిదాకు తీసుకెళ్లేందుకు కర్నూలు జిల్లా నుంచి ముగ్గురు ఏఆర్‌ పోలీసులు ఎస్కార్టుగా వచ్చారు. అక్కడి నుంచి వారిని మభ్యపెట్టి కడప బిల్టప్‌ జంక్షన్‌ వద్దకు రాగానే కేంద్ర కారాగారానికి వెళ్లకుండా దిగారు.

అంతలోపు అతని బంధువులు రెండు మోటారు సైకిళ్లను, ఒక కారును, ఒక మహిళను తమతోపాటు తీసుకొచ్చారు. పెండ్లిమర్రి మండలం నందిమండలం కొండ గంగమ్మ గుడి వద్దకు అందరూ వెళ్లారు. అక్కడ పోలీసు ఎస్కార్టును దూరంగా ఉంచి సునీల్‌కుమార్, అతని అనుచరులు కారుతోపాటు పోలీసుల తుపాకులు దొంగలించి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై అదేరోజు పెండ్లిమర్రి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే సంఘటనకు సంబంధించి ఈనెల 1వ తేదిన ముగ్గురు ఏఆర్‌ పోలీసులను, సునీల్‌కుమార్‌ అనుచరులలో ముగ్గురిని డీఎస్పీ ఆద్వర్యంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు సునీల్‌కుమార్‌ కోసం కడప, బెంగుళూరు, ముంబయి ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సునీల్‌కుమార్‌ను బెంగుళూరులోని రాజాజీ రోడ్డులో ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది.

సునీల్‌కుమార్‌ పెండ్లిమర్రి మండలం నందిమండలం నుంచి కారులో వెళ్లాడు. ఆయుధాలను తన అనుచరులైన గోపాల్, శ్రీనివాసులకు అప్పగించి మిగతా అనుచరులతో మోటారు సైకిళ్లపై పారిపోయాడు.
చిన్నచెప్పలి వద్ద గుట్టపై అదేరోజు తన అనుచరుడు హరితోపాటు ఉండి అక్కడి నుంచి ఒక రైతు మోటారు సైకిల్‌ దొంగలించి ఎర్రగుంట్లకు వచ్చి రైలులో బళ్లారి, అక్కడి నుంచి బస్సులో హోస్పేటకు పారిపోయాడు. హోస్పేటలో రెండు రోజులు లాడ్జిలో ఉండి అక్కడి నుంచి ముంబయికి బస్సులో వెళ్లాడు. ఏప్రిల్‌ 1వ తేదిన ముంబయికి చేరుకుని అదేరోజు రాత్రి  బస్సులో బెంగళూరుకు చేరుకున్నాడు. 2వ తేదీ నుంచి ఈనెల 4వ తేదీ రాత్రి వరకు బెంగళూరులోని పేయింగ్‌ గెస్ట్‌రూములో ఉన్నాడు. అక్కడికి చేరుకున్న పోలీసు బృందం బెంగుళూరులోని రాజాజీనగర్‌ రోడ్డులో అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని తాడిగొట్ల క్రాస్‌ రోడ్డు వద్దకు తీసుకు రాగా కాలకృత్యాలు తీర్చుకునే నెపంతో పోలీసులపై రాళ్లతో దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయగా, పోలీసు బృందం సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుంది.

2014లో జిల్లాలోని పులివెందుల–తాడిపత్రి మార్గమధ్యంలో ఓ వాహనంలో వేట కొడవళ్లు పెట్టుకుని కిడ్నాప్‌ నకు ప్రయత్నిస్తున్న సమయంలో అప్పటి జమ్మలమడుగు ఏఎస్పీ అప్పలనాయుడు పర్యవేక్షణలో సింహాద్రిపురం ఎస్‌ఐగా పనిచేసిన ఎన్‌.రాజరాజేశ్వర్‌రెడ్డి తమ బృందంతో కలిసి అరెస్టు చేశారు.
కడప కేంద్ర కారాగారం గేటు బయటి నుంచి  2014లో వాయిదాకు వెళ్లి వచ్చి  ఎస్కార్టు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. కడప కేంద్ర కారాగారంలో కూడా ప్రతి ఆదివారం ఒక కిలో మేరకు చికెన్‌గానీ, మటన్‌గానీ తీసుకుని కడుపారా ఆరగించి తన అనుచరులకు కూడా ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఎస్కార్టు వెళ్లిన ప్రతిసారి తనకు అనుకూలంగా ఉండే పోలీసుల ద్వారా మద్యం సేవించడం, కడుపార తినడం, అవసరాలు తీర్చికోవడం పరిపాటిగా మారిందని తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారంలోనే సునీల్‌కుమార్‌ వచ్చినప్పటి నుంచి దాదాపు 15 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

Advertisement
Advertisement