దొంగతనం కేసులో సినీ పాటల రచయిత కులశేఖర్‌ అరెస్ట్‌

29 Oct, 2018 02:39 IST|Sakshi

హైదరాబాద్‌: దేవాలయాల్లో పూజారుల కళ్లుగప్పి శఠగోపాలు, వారి సెల్‌ఫోన్లు, డబ్బు లు చోరీచేస్తున్న ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్‌ను బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. విశాఖపట్నానికి చెందిన తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్‌(47) కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివాసముంటూ పలు సినిమాలకు పాటలు రాశాడు. సంతోషం, ఘర్షణ, ప్రేమలేఖ, ఫ్యామిలీ సర్కస్, చిత్రం, జయం, వసంతం, మృగరాజు, ఇంద్ర తదితర వంద సినిమాలకు పాటలు రాశాడు.  

కొంతకాలంగా అవకాశాలు రాకపోవడంతో బతుకుదెరువు కోసం చోరీలకు పాల్పడుతున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2 లోని ఇందిరానగర్‌లో ఉన్న అమ్మవారి ఆలయంలో పూజారి బ్యాగ్‌ చోరీకి గురవ్వగా, పోలీసులు నిఘా వేసి సీసీ కెమెరా ఫుటేజీలు, కదలికల ఆధారంగా కులశేఖర్‌ను విచారించడంతో గుట్టురట్టయింది. గతంలో గుడిలో చోరీ చేసిన కేసులో 6 నెలల  జైలు శిక్ష అనుభవించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడి నుంచి రూ.50 వేల విలువ చేసే పది సెల్‌ఫోన్లు, రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

వందకు పైగా సినిమాలకు కులశేఖర్‌ పాటలు రాశాడు. కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరమై చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యాడు. 2016లో కాకినాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శఠగోపం చోరీ చేశాడు. ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో ఆరు నెలలపాటు జైలుశిక్షను అనుభవించాడు. ఓ సినిమాలో కులశేఖర్‌ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని దూరం పెట్టింది. బ్రాహ్మణుల మీద కులశేఖర్‌ ద్వేషాన్ని పెంచుకుని పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

మరిన్ని వార్తలు