కారు జోరు కొనసాగిద్దాం | Sakshi
Sakshi News home page

కారు జోరు కొనసాగిద్దాం

Published Mon, Oct 29 2018 2:41 AM

KTR's New Age Politics? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అభివృద్ధి దూసుకుపోతోందని, కారు జోరు కొనసాగేలా చూద్దామని, డ్రైవర్ని మార్చొద్దని మంత్రి కేటీఆర్‌ ఉత్తర భారతీ యులతో అన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో పలువురు రాజస్తాన్, హరియాణాకు చెందిన మార్వాడీ, అగర్వాల్, మహేశ్వరీ, జైన్‌ మైనార్టీలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ నాలుగేళ్లలో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

నగరంలో శాంతిభద్రతల విషయం లో ఎక్కడా రాజీపడలేదని, ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ విధించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. 10 లక్షల సీసీ కెమెరాల్లో ఇప్పటికే 5 లక్షలు బిగించామని, బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశామని, నీరు, విద్యుత్తు, రవాణాకు ప్రాధాన్యమిచ్చామన్నారు. మెట్రో, ఓర్‌ఆర్‌ఆర్‌ను పూర్తి చేశామని, త్వరలోనే రీజినల్‌ రింగ్‌ రోడ్‌ను కూడా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు

కాంగ్రెసోళ్లను చూస్తే జాలేస్తోంది...
కాంగ్రెస్‌వి ఢిల్లీ రాజకీయాలు, చీటికి మాటికి హస్తినకు పరుగులుపెట్టే ఆ పార్టీ నాయకులను చూస్తే జాలేస్తుందన్నారు. వాళ్ల ముఖ్యమంత్రులు ఢిల్లీ సీల్డ్‌ కవర్‌లో ఉంటారని, కేసీఆర్‌ హైదరాబాద్‌ గల్లీలో ఉంటారన్నారు. కాంగ్రెస్, టీడీపీల కంటే తాము ఎంతో మెరుగ్గా పాలించామన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు ప్రజలకు ‘చేయి’చ్చారు. బీజేపీ వాళ్లు చెవిలో ‘పూలు’ పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అభివృద్ధిలో కారు జోరు మీదుందని, డ్రైవర్ని (కేసీఆర్‌ని) మార్చొద్దని కోరారు. గ్రేటర్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో ఇచ్చినట్లే ఈసారీ టీఆర్‌ఎస్‌కు అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరారు.

బీజేపీ నేతల మాటలు వింటే నవ్వాగడం లేదని, అధికారంలోకొస్తే ఇంటి కిరాయి కి రూ.5 వేలిస్తారట.. ఇంకా నయం.. సోఫా కవర్లు మారుస్తాం.. పాత పేపర్లు అమ్మిపెడతాం అనలేదం టూ విమర్శించారు. నగరంలో 9000 కి.మీ. మేర ఉన్న రహదారుల్లో 4000 కి.మీ. మేర కేబుల్, వాటర్‌ పైపులైన్ల కోసం తవ్విన మాట వాస్తవమేనని అంగీకరించారు. అవన్నీ గత ప్రభుత్వాలు చేసిన తప్పుడు విధానాలను సరిచేయడంలో భాగంగానే చేశామన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే రూ. 50 వేల కోట్లతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరిస్తామన్నారు. అనంతరం పలువురు పార్టీలో చేరారు. కాగా కేటీఆర్‌ సోమవారం ఉమ్మడి పాలమూరులో పర్యటించనున్నారు. అచ్చంపేటలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement