ఎంపీ సుమన్‌ ఇంట్లో చోరీ | Sakshi
Sakshi News home page

ఎంపీ సుమన్‌ ఇంట్లో చోరీ

Published Sun, Apr 8 2018 9:36 AM

MP Suman House Was Robbed - Sakshi

మంచిర్యాలక్రైం : మంచిర్యాలలోని గౌతమినగర్‌లో గల పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్‌ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుండగులు తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని సామాన్లను చిందరవందరగా పడేశారు. ఈ ఘటనలో ఎంపీ ఇంట్లో నుంచి ఎలాంటి సొత్తు చోరీకి గురికాలేదని టౌన్‌ ఎస్సై శ్రీనివాసయాదవ్‌ తెలిపారు. ఎంపీ సుమన్‌ గతంలో పక్కనే ఉన్న మరో ఇల్లును అద్దెకు తీసుకున్నారు. ఇటీవలే ప్రస్తుత ఇంట్లోకి మారారు. ఇక్కడ సెక్యూరిటీ కానీ, సీసీ కెమెరాలు గానీ ఏర్పాటు చేసుకోలేదు. ఎంపీ సుమన్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంచిర్యాలకు వచ్చినప్పుడు ఈ ఇంట్లో రెండు మూడు రోజులు ఉండి వెళ్లిపోతారు. ఆయన పీఏ మాత్రం రోజూ ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్తారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం ఇక్కడికి వచ్చిపోతుంటారు. శనివారం ఉదయం పీఏ వచ్చేసరికి తాళం పగులగొట్టి, లోపల వస్తువులు చిందరవందర చేసి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అడిషనల్‌ డీసీపీ (లా అండ్‌  ఆర్డర్‌) రవికుమార్‌ ఎంపీ ఇంటిని సందర్శించి, వివరాలు సేకరించారు. ఇంటిలో నుంచి ఎలాంటి వస్తువులు అపహరణకు గురికాలేదని పేర్కొన్నారు.

మరో మూడు ఇళ్లలోనూ..
కాగా ఎంపీ సుమన్‌ ఇంటి పక్కనే ఉన్న వ్యాపారులు తునికిపాటి అమరాచారి, మామిడి సందీప్‌కుమార్‌ (బిజినేస్‌) ఇళ్లలో కూడా దొంగలు చోరీకి పాల్పడి విలువైన సొత్తును అపహరించారు. సందీప్‌ ఇంటి పక్కనే ఉన్న తిరుమల అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కనకయ్య ఇంట్లో దొంగతనానికి యత్నించి విఫలమయ్యారు. కాగా అమరాచారి కుటుంబంతో కలిసి ఈ నెల 5న హైదరాబాద్‌ వెళ్లారు. శనివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పక్కింటి వారు వెళ్లి చూడగా తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులకు, అమరాచారికి సమాచారం అందించారు. అమరాచారి ఇంట్లో జరిగిన దొంగనతంలో 20 గ్రాముల బంగారు రుద్రాక్షమాల రూ.2వేలు ఎత్తుకెళ్లారు. అలాగే సందీప్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 2న స్వగ్రామం బెల్లంపల్లికి వెళ్లారు. తాళం పగలగొట్టి ఉండడంతో దొంగలు పడ్డారని భావించిన సందీప్‌ పోలీసులకు సమాచారం అందించారు. సందీప్‌ ఇంట్లో రూ.70వేలు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఫింగర్‌ ఫ్రింట్‌ నిపుణులు వేలిముద్రలు సేకరించారు. కాగా ఈ దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. 

Advertisement
Advertisement