చెవిరెడ్డి హత్యకు కుట్ర..! | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డి హత్యకు కుట్ర..!

Published Wed, Feb 6 2019 10:47 AM

Murder Attempt on Chevireddy Bhaskar Reddy Chittoor - Sakshi

తిరుపతి రూరల్‌: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హత్యకు రెక్కీ జరిగింది. చిత్తూరుకు చెందిన పులివర్తి నాని అనుచరులు ఇద్దరు పట్టుబడ్డారని మీడియాలో రావడంతో తిరునగరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ విష సంస్కృతి తిరుపతికి రాకూడదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి ప్రయత్నాలు, ఆలోచనలు చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

అసలెం జరిగిందంటే...
రెండు నెలల క్రితమే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని కుటుంబ సభ్యులు ఇంటింటా ప్రచారం మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని వాహనాలను అద్దెకు తీసుకున్నారు. ఇదే అవకాశంగా చిత్తూరు చెందిన నాని అనుచరుడు నాగభూషణం తాను తిరుపతి వాడినని, తనకు బతుకుదెరువు చూపించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డిని కోరారు. నెలరోజుల క్రితం ఎమ్మెల్యే వాహనాల శ్రేణిలో చేరాడు. 10 రోజుల తర్వాత తన స్నేహితుడు సిసింద్రీని డ్రైవర్‌గా చేర్చాడు.

డ్రైవర్‌గా ఉంటునే ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? ఎవరెవరిని కలుస్తున్నారు? అనే వివరాలను సేకరించడంతో పాటు ఇళ్లు, ఆఫీసుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు చిత్తూరులోని పులివర్తి నాని అనుచరుడు రెడ్డెప్పకు చేరవేశాడు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యేపై దాడి జరిగిన సమయంలో ఆయన ఒక్కడే వస్తున్నాడని, అనుచరులు లేరని వేదాంతపురంలోని నాని అనుచరులకు చేరవేసినట్లు సమాచారం. ఆ క్రమంలోనే గొడవ జరగడం, ఎమ్మెల్యే సృహ తప్పడం, ఆస్పత్రిపాలు కావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ మొత్తం కూడా వీడియో తీసి చిత్తూరుకు చేరవేశారు.

బయట పడింది ఇలా..
‘మీ దగ్గర చిత్తూరుకు చెందిన ఇద్దరు డ్రైవర్ల ముసుగులో నాని అనుచరులు ఉన్నారు. హత్యకు ప్లాన్‌ చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి..జాగ్రత్త అంటూ’ దాడి జరిగిన తర్వాత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఓ అజ్ఞాతవ్యక్తి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆరా తీసిన ఎమ్మెల్యేకు పలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానంతో చిత్తూరు పంట్రాంపల్లికి చెందిన నాగభూషణం, సిసింద్రీల ఫోన్‌లను పరిశీలించారు. దీంతో సమాచారం చిత్తూరు చేరవేస్తున్నట్లు నిర్ధారణ అయింది. మంగళవారం సాయంత్రం తుమ్మలగుంటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిందితులు నాగభూషణం, సిసింద్రీలు సుఫారీ గురించి వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున డీల్‌ కుదిరిందని, అందులో తనకు రూ.లక్ష అడ్వాన్స్‌ ఇచ్చారని నాగభూషణం తెలపగా, తనకు రూ.40 వేలు అడ్వాన్స్‌ ఇచ్చారని సిసింద్రీ మీడియాకు తెలిపారు. మొదటి దశలో ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ వెళ్తున్నారు? ఏ మార్గంలో వెళ్తున్నారు? వంటి సమాచారం చిత్తూరులోని నాని అనుచరుడు రెడ్డెప్పకు వాట్సాప్, ఫోన్‌ ద్వారా చేరవేస్తున్నట్లు చెప్పారు. సమయం చూసి రెండో దశ ఆదేశాలు ఇస్తామన్నారని, అందుకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గతంలో పులివర్తి నాని, గోపికి చెందిన గ్రానైట్, ఎర్రచందనం లారీలను పైలెట్‌గా వెళ్లి హైవే దాటించేవాళ్లమని, పోలీసులకు రూ.2వేలు, ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీలు హైవేలో ఉంటే నానితో ఫోన్‌లో మాట్లాడించి అకౌంట్‌ నెం బర్‌కు నగదును బదిలి చేయించేవాళ్లమన్నారు. చిత్తూరులో జాతర, వినాయకచవితి, గరుడవాహ నం ఉత్సవాల్లో పులివర్తి నాని, వసంత్, గోపి, రెడ్డెప్పకు బ్యానర్లు, కటౌట్లు కట్టేవాళ్లమన్నారు.

ఇళ్లు ఇస్తాం...అప్పు తీరుస్తాం..
డీల్‌కు ఓకే అయితే మీకు ఏం కావాలన్నా చేస్తామని నాని అనుచరుడు రెడ్డెప్ప, కార్పొరేటర్‌ గోపి నిందితులకు ఆశ చూపించారు. రూ.15 లక్షలతో తనకు ఇళ్లు కట్టిస్తామన్నారని నాగభూషణం తెలపగా, రూ.15 లక్షలతో తనకు ఉన్న అప్పులు తీరుస్తామని చెప్పడంతో డీల్‌కు ఒప్పుకున్నట్లు సిసింద్రీ తెలిపారు. అనంతరం నిందితులను అర్బన్‌ ఎస్పీకి అప్పగించారు. ఎంఆర్‌పల్లి పోలీçసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పుణ్యక్షేత్రం ప్రశాంతంగా ఉండాలి
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతికి రోజూ వేలాది మంది భక్తులు వస్తున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఇక్కడ భక్తిభావం ఉండాలే తప్ప, హత్య రాజకీయాలు, రెక్కీలు, దాడులు, దౌర్జన్యాలు ఉండకూడదన్నారు. ప్రజల కూడా వాటిని అంగీకరించరన్నారు. ఎవరైనా ప్రజా సమస్యలపైనే పోరాటాలు చేయాలన్నారు.

Advertisement
Advertisement