అంకుల్‌.. మా నాన్నను వాడే చంపేశాడు.. | Sakshi
Sakshi News home page

అంకుల్‌.. మా నాన్నను వాడే చంపేశాడు..

Published Sun, Aug 5 2018 12:22 PM

Murder Case In Khammam - Sakshi

‘‘అంకుల్‌.. మా నాన్నను చంపేశాడు. కిందపడి రక్తపు మడుగులో కొట్టుకుంటున్న మా నాన్నను హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఎవ్వరూ రాలేదంకుల్‌...’’ ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. చిన్న రక్తపు చుక్కను చూస్తేనే పిల్లలు తట్టుకోలేరు. అలాంటిది, తన కన్నతండ్రి కొన ఊపిరితో రక్తపు మడుగులో కొట్టుకోవడాన్ని చూసిన ఈ చిన్నారి ఎంతగానో వణికిపోయాడో.. చుట్టూ కళ్లప్పగించి చూస్తున్నజనాలలో నుంచి ఏ ఒక్కరూ వెంటనే ముందుకు రాకపోవడాన్ని చూసిన వాడి మనసు ఎంతగా గాయపడిందో...
 

ఖమ్మంక్రైం: ఖమ్మంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని ఒకడు కత్తితో పొడిచి చంపాడు. మహబూబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ములకపల్లికి చెందిన కోదాటి ఉపేందర్‌(32). ఖమ్మంలోని రోటరీ నగర్‌లోగల పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య స్వాతి, ఇద్దరు చిన్నారులు తనీష్, త్రివేష్‌ ఉన్నారు. మేదర బజార్‌ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అదే ప్రాంతంలో అతని అమ్మమ్మ దుర్గమ్మ నివసిస్తోంది. ఆ ప్రాంతంలోనే ఒకడున్నాడు.

వాడి పేరు యర్రగాని శ్రీను. జులాయిగా తిరుగుతూ, అందరితో గొడవలు పడుతుంటాడు. దుర్గమ్మను అతడు తిట్టాడు. శనివారం ఇంటి వద్దనే ఉన్న తన మనవడైన ఉపేందర్‌తో ఆమె ఈ విషయం చెప్పింది. ఆమెను వెంటబెట్టుకుని, పక్క వీ«ధిలోనే ఉన్న యర్రగాని శ్రీను వద్దకు ఉపేందర్‌ వెళ్లాడు. తన అమ్మమ్మను ఎందుకు తిట్టావని ప్రశ్నించాడు. అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న శ్రీను, ఉపేందర్‌ను దుర్భాషలాడుతూ మీదకు వచ్చాడు. తన వద్దనున్న కత్తితో ఉపేందర్‌ గుండెల్లో బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఉపేందర్‌ కింద పడిపోయాడు.

గుడ్లప్పగించి చూశారు... 
ఉపేందర్, యర్రగాని శ్రీను మధ్య గొడవ జరుగుతుండడంతో ఆ వీధిలోని జనం గుమిగూడారు. వారించేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. చివరికి, కత్తితో పొడుస్తున్నప్పుడు కూడా అలాగే వింతగా, విభ్రాంతిగా చూస్తుండిపోయారు. అడ్డుకునేందుకుగానీ, కాపాడేందుకుగానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. రక్తపు మడుగులో పడిపోయి, కొనఊపిరితో కొట్టుకుం టున్నప్పుడు కూడా అలా చూస్తున్నారేగానీ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధపడలేదు. కొద్దిసేపటి తరువాత, కొందరు మహిళలు అడుగు ముందేకేశారు. అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే మృతిచెందాడు.

ఆ అంకుల్‌ చంపేశాడు... 
ఉపేందర్‌ పెద్ద కుమారుడైన చిన్నారి తనిష్, ఆస్పత్రిలో గుండె పగిలేలా రోదిస్తున్నాడు. ‘‘మా నాన్నను ఆ అంకుల్‌ చంపేశాడు. మా నాన్న ఇంకా రాలేదని వెళ్లాను. నాన్న పడిపోయాడు. రక్తం కారుతోంది. నాకు భయమేసింది. పరిగెత్తుకొంటూ మా అమ్మను తీసుకొచ్చాను...’’ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ చిన్నారి చెప్పిన విషయమిది.

ఎలా బతకాలి...? 
‘‘పొట్టకూటి కోసం... బతకటానికి ఖమ్మం వచ్చాం. మేమిప్పుడు ఎలా బతకాలి దేవుడా...?’’ అని, తన ఇద్దరు పిల్లలను పొదివి పట్టుకుని గుండె బాదుకుంటూ రోదిస్తోంది స్వాతి. ఆ ముగ్గరినీ ఓదార్చడం ఎవరితరం కాలేదు. అక్కడి దృశ్యాలు.. చూపరులకు కంట తడి పెట్టించాయి.

 కేసు నమోదు 
ఉపేందర్‌ను చంపిన యర్రగాని శ్రీను, గతంలో ఇలాగే గొడవలు పడి.. కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లొచ్చాడని ఆ వీధిలోని కొందరు చెప్పారు. అతడు నిత్యం ఎవరో ఒకరితో గొడవపడుతూనే ఉంటాడని అన్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. మృతదేహాన్ని మార్చురీకి పోలీసులు తరలించారు. వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. హత్య స్థలాన్ని సీఐ రమేష్‌ పరిశీలించారు.

1/1

రోదిస్తున్న భార్య, పిల్లలు, బంధువులు

Advertisement
Advertisement