ప్రాణం తీసిన పాతకక్షలు | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన పాతకక్షలు

Published Thu, Jun 6 2019 1:01 PM

Murder in Kurnool With Old Bumps - Sakshi

కర్నూలు, కల్లూరు: పాతకక్షలు ఓ నిండు ప్రాణాన్ని తీశాయి. పగతో రగిలిపోయిన ప్రత్యర్థులు.. వడ్డె వెంకటేశ్వర్లు అనే యువకుడిని హత్య చేశారు. ఈ దారుణం ఉలిందకొండ పోలీసు స్టేషన్‌ పరిధిలోని నాయకల్లు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. వడ్డె తిమ్మన్న, వడ్డె లక్ష్మన్న ఇళ్లు పక్క పక్కనే ఉన్నాయి. చిన్న విషయాలకే(ఇంటి గోడలకు రంగులు వేయడం..చెత్త ఎత్తివేయడం) ఇరు కుటుంబాల «మధ్య గతంలో గొడవ జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో వడ్డె తిమ్మన్న కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. బుధవారం మధ్యాహ్నం వడ్డె తిమ్మన్న పెద్ద కుమారుడు వడ్డె సత్యం మల్లెపూలు వేసేందుకు చిన్నటేకూరుకు ద్విచక్ర వాహనంపై బయలు దేరగా చెట్లమల్లాపురం, నాయకల్లు గ్రామాల మధ్య వడ్డె లక్ష్మన్న మరో ఐదుగురితో కలిసి దాడి చేశారు. స్వల్ప గాయాలతో వడ్డె సత్యం తప్పించుకుని ఉలిందకొండ పోలీసుస్టేషన్‌కు వెళ్లి.. తండ్రిని పిలిపించుకుని ఫిర్యాదు చేశారు.

పోలీసు సహాయంతో గ్రామానికి వెళ్లి.. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. పాతకక్షలతో రగిలిపోయిన వడ్డె లక్ష్మన్న మరో మారు ఐదుగురితో కలిసి పొలంలోకి  ప్రవేశించి దాడికి తెగబడ్డాడు. వడ్డె తిమ్మన్న, వడ్డె వెంకటేశ్వర్లు(17), వడ్డె రంగమ్మలపై విచక్షణ రహితంగా రాడ్లతో దాడి చేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన వడ్డె సత్యం పొలం దాటిపోయాడు. వడ్డె వెంకటేశ్వర్లు తలపై రాడ్‌తో దాడి చేయడంతో అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందాడు. కుమారుడిని రక్షించేదుకు వెళ్లిన తల్లి, తండ్రిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. వారు కేకలు వేయడంతో పక్కనున్న పొలాల్లో ఉన్న వారు పరుగెత్తుకొచ్చారు. గమనించిన వడ్డె లక్ష్మన్న మరో ఐదుగురు అక్కడి నుంచి తాము తెచ్చుకున్న ఆటోలో పరారయ్యారు. సమాచారం తెలుసుకొని తాలూకా సీఐ, ఉలిందకొండ ఎస్‌ఐ గోపాల్‌ రెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
Advertisement