Sakshi News home page

భార్యను హత్యచేసి..ఆపై ఆత్మహత్య

Published Wed, May 2 2018 7:59 AM

Murder In Manikonda - Sakshi

శంకరపట్నం(మానకొండూర్‌) : అనుమానం.. కుటుంబకలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హతమార్చి.. ఆపై తానూ క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దుర్గం తిరుపతికి అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 25 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి కుమారుడు, కూతురు సంతానం. జల్సాలకు అలవాటుపడిన తిరుపతి.. కొన్నేళ్లక్రితం అదే గ్రామానికి చెందిన గౌరమ్మను రెండో వివాహం చేసుకున్నాడు.

ఆమెను హైదరాబాద్‌ తీసుకెళ్లి అక్కడ ఆరేళ్లపాటు ఉన్నాడు. గౌరమ్మకూ ఓ కూతురు ఉంది. రెండోవివాహం చేసుకున్నప్పటినుంచీ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. తిరుపతి ధనలక్ష్మిని తరచూ అనుమానిస్తుండేవాడు. ప్రతిసారీ భార్యతో గొడవపడేవాడు. దీంతో ధనలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ శివారులోని రేకుర్తికి గౌరమ్మతో కలిసి మకాం మార్చిన తిరుపతి.. కొద్దిరోజులు కూరగాయలు విక్రయించాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ.. రెండేళ్ల క్రితం గౌరమ్మ బావిలో శవమై తేలింది. తిరుపతి వేధింపులతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లోనే స్థానికులు చర్చించుకున్నారు. 

పిల్లలిద్దరూ దూరంగా..  

తిరుపతి మొదటిభార్య కుమారుడు గణేశ్‌ గ్రామంలోనే వైండింగ్‌ పనులు చేసేవాడు. ఏడాదిక్రితం అదే గ్రామానికి చెందిన శ్రావ్యతో పెళ్లయ్యింది. శ్రావ్య హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చేస్తుండడంతో కొద్దిరోజుల క్రితం భార్యాభర్తలిద్దరూ అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కూతురు నిహారిక హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో బీటెక్‌ చదువుతోంది.

రెండో భార్య కూతురు వివాహం.. అంతలోనే సంఘటన

దారుణంగా హత్య.. 

దుర్శేడ్‌ వెళ్లి ఇంటికి చేరకున్న తిరుపతి, ధనలక్ష్మి సోమవారం రాత్రి గొడవపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన తిరుపతి.. నిద్రిస్తున్న ధనలక్ష్మిని గొడ్డలితో నరికాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం..తానూ క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు. మంగళవారం ఉదయం 7గంటలకు అదే గ్రామానికి చెందిన పోచయ్య వెళ్లి చూసేసరికి ఇంటిముందు తిరుపతి.. ఇంట్లో మంచంపై ధనలక్ష్మి శవాలై కనిపించారు.

విషయం తెలుసుకున్న కరీంనగర్‌ అడిషనల్‌ సీపీ సంజీవ్‌కుమార్, ఏసీపీ కృపాకర్, హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ రవికుమార్, ఎస్సై ఎల్లాగౌడ్‌ ఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రైన్‌లో హైదరాబాద్‌ వెళ్తున్న కుమారుడు, కూతురుకు సమాచారం చేరవేశారు. గణేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

Advertisement

What’s your opinion

Advertisement