క్లూ దొరికింది! | Sakshi
Sakshi News home page

క్లూ దొరికింది!

Published Mon, Jul 30 2018 8:26 AM

Mystery Reveals In SBI Robbery Case Anantapur - Sakshi

జేఎన్‌టీయూ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఎస్‌బీఐలో జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంకు లాకర్‌ను కట్‌ చేసేందుకు ఉపయోగించిన గ్యాస్‌ సిలిండర్‌ ఆధారంగా తీగలాగిన పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. వాటి సాయంతో దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం : జేఎన్‌టీయూ క్యాంపస్‌ ఎస్‌బీఐలో శుక్రవారం రాత్రి రూ.39 లక్షల సొమ్మును దుండగులు అత్యంత పకడ్బందీగా చోరీ చేసినా...లాకర్‌ను కట్‌ చేసేందుకు ఉపయోగించిన గ్యాస్‌సిలిండర్‌ను అక్కడే వదిలిపోయారు. దీంతో పోలీసులు గ్యాస్‌ సిలిండర్‌ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఓ దుకాణంలో రూ.10 వేలు అడ్వాన్స్‌ ఇచ్చి నిందితులు సిలిండర్‌ కొనుగోలు చేసినట్లు తెలిసింది. పైగా అక్కడ నగదు కాకుండా డెబిట్‌కార్డు వినియోగించినట్లు తెలిసింది. దీంతో బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్, ఆ ఖాతా ద్వారా చేసిన లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్యాంక్‌ అకౌంట్‌లో నమోదైన ఫోన్‌ నంబర్‌ ద్వారా నిందితుల కాల్‌డేటాను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. సిలిండర్‌ దుకాణంలోని సీసీ కెమెరాల ద్వారా నిందితుల ఫొటోలను సేకరించినట్లు సమాచారం. వ్యాపారితో వారు హిందీ మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. బ్యాంక్‌ అకౌంట్‌ ఆధారంగా వారు మధ్యప్రదేశ్‌ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి చిరునామా కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు దుండగులు బెంగళూరు నుంచి వెర్నాకారులోవచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ అనంతరం తిరిగి బెంగళూరువైపు వెళ్లినట్లు స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ సీసీ కెమెరాల్లోనూ...అలాగే టోల్‌గేట్లలో రికార్డయిన చిత్రాలను బట్టి తెలుస్తోంది.

రంగంలో మూడు బృందాలు
దొంగలను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ మూడు బృందాలను రంగంలోకి దింపారు. బెంగళూరు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆచూకీ కనుక్కొనేందుకు ఓ బృందం, టోల్‌గేట్ల సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దొంగలు వెళ్లిన రూట్లలో మరో బృందం, పాత నేరస్తులను గుర్తించి ఫింగర్‌ప్రింట్స్‌ మ్యాచింగ్‌కు మరో బృందాన్ని నియమించారు. మొదటి బృందం మధ్యప్రదేశ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. రెండో బృందం టోల్‌గేట్లలోని సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల వెళ్లిన రూట్‌లో వెళుతున్నట్లు తెలుస్తోంది. నిందితులు చోరీకి వినియోగించిన కారులోనే ఇంకా ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

మ్యాచ్‌ కాని ఫింగర్‌ ప్రింట్స్‌  
దొంగలకు అడ్డా అయిన షోలాపూర్‌లో ఈ నెల 11న ఓ బ్యాంక్‌ రాబరీ జరిగింది. అక్కడ, ఇక్కడ వేలిముద్రలు సేకరించిన పోలీసులు...వాటిని మ్యాచ్‌ చేసి పనిలో ఉన్నారు. గతేడాది మేనెలలో అనకాపల్లిలోని హైవే సమీపంలోని గ్రామీణ బ్యాంక్‌ను దుండగులు రెండుసార్లు కొళ్లగొట్టారు. అక్కడ గుర్తించిన వేలిముద్రలతో జేఎన్‌టీయూ ఎస్‌బీఐ బ్యాంకు వద్ద దొరికిన వేలిముద్రలను సరిపోల్చారు. అయితే మ్యాచ్‌ కాలేదు. అనకాపల్లి దొంగలు కర్ణాటకలోని రాయచూరుకు చెందిన వారుగా తెలుస్తోంది. గంగాధర్‌ ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో షోలాపూర్‌ రాబరీలోని పాల్గొన్న వారి వేలిముద్రలతో సరిపోల్చేపనిలో ఉన్నారు. ఈరెండు మ్యాచ్‌ అయితే కేసులో మరింత పురోగతి సాధించినట్లే. ఇతర రాష్ట్రాల్లో జరిగిన బ్యాంక్‌ రాబరీలోని దొంగల వేలిముద్రలతో సరిపోల్చేందుకు ఓ బృందం ప్రత్యేకంగా పనిచేస్తోంది.

బ్యాంక్‌ రాబరీ ముఠా పనే
జేఎన్‌టీయూ ఎస్‌బీఐని చోరీ చేసిన ముఠా బ్యాంక్‌రాబరీలు, ఏటీఎంలు కొల్లగొట్టడంలో ఆరితేరినట్లు తెలుస్తోంది. ఇటీవలే జార్ఖండ్‌లో ఓ బ్యాంక్‌లో రాబరీ చేసేందుకు యత్నించారనీ... అయితే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లేలోపు తప్పించుకుని వెళ్లిపోయినట్లు అనంత పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు వచ్చిన ముఠా ‘అనంత’కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా రెక్కీ నిర్వహించారా? లేదా? అనే కోణంలో కూడా పోలీసులు నగరంలోని సీసీ కెమెరాలతో పాటు జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలించారు. దుండగులు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? ఎవరితో వచ్చారు? ‘అనంత’లోని లాడ్జీల్లో బస చేశారా? లేదంటే బెంగళూరు నుంచి నేరుగా వచ్చారా? అనే కోణంలో స్థానిక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

బ్యాంక్‌ సిబ్బంది ప్రమేయం లేదా?
చోరీలో బ్యాంకు సిబ్బంది ప్రమేయం లేదని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దొంగలు చోరీకి పాల్పడిన లాకర్‌కు సమీపంలో బంగారానికి సంబంధించిన లాకర్లు ఉన్నాయి. అందులో రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల విలువైన బంగారం ఉంది. బ్యాంక్‌ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లయితే కచ్చితంగా బంగారం కొల్లగొట్టేవారు. అది కాకుండా రూ.39 లక్షల నగదును మాత్రమే దోపిడీ చేశారంటే తరచూ చోరీలకు పాల్పడే ముఠా వచ్చి లాకర్లను కట్‌ చేశారు. అందులో నగదు కన్పించడంతో దోచుకున్నారు. అది పూర్తయ్యేలోపే తెల్లవారుజామున 3.30 గంటలు అయినట్లు తెలుస్తోంది. ఒక వేళ బంగారం ఉన్న లాకర్ల వైపు వెళ్లి ఉంటే రూ.కోట్ల విలువైన బంగారం పోయేది. 

త్వరలోనే దొంగలనుపట్టుకుంటాం
బ్యాంకు రాబరీ దొంగలను పట్టుకునేందుకు 3 బృందాలను నియమించాం. లోకల్‌ పోలీసులు కూడా ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. కేసులో పురోగతి వచ్చింది. నార్త్‌ ఇండియాకు చెందిన ముఠాగా అనుమానిస్తున్నాం. త్వరలోనే దొంగలను పట్టుకుంటాం.  – అశోక్‌కుమార్, ఎస్పీ 

Advertisement
Advertisement