హరికృష్ణ మృతికి కారణాలివే..!

29 Aug, 2018 09:20 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : సీటు బెల్టు పెట్టుకోకపోవడం, అత్యంత వేగంగా వాహనాన్ని నడుపడం.. వాహనం నడుపుతున్న సమయం తెల్లవారుజాము కావడం ఇవే..  రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ (61) మృతికి కారణాలని పోలీసులు చెప్తున్నారు. ఆయన స్వయంగా నడుపుతున్న కారు నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమదం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలను నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌ ‘సాక్షి’ టీవీకి వివరించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. సీటు బెల్లు ధరించి ఉంటే ప్రమాద స్థాయి తగ్గేదన్నారు. ప్రమాదం జరిగే సమయంలో ఫార్చునల్‌ కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోందని, ఈ సమయంలో వాటర్‌ బాటిల్‌ కోసం కారును నడుపుతున్న హరికృష్ణ వెనక్కి తిరగడంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పిందని ఆయన తెలిపారు. దీంతో డివైడర్‌ను ఢీకొట్టి 15 మీటర్ల దూరంలోకి కారు ఎగిరిపడిందని, డ్రైవింగ్‌ సీట్లో ఉన్న హరికృష్ణ 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారని ఎస్పీ వివరించారు.  ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.


‘నెల్లూరు జరిగే ఓ వివాహానికి AP28 BW 2323 నంబర్‌ కారులో ఈ రోజు (బుధవారం) తెల్లవారు జామున 4.30 ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి హరికృష్ణ బయల్దేరారు. కారును హరికృష్ణ డ్రైవ్‌ చేస్తున్నారు.  160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి అన్నెపర్తి వద్ద డివైడర్‌ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢికొట్టింది. దీంతో కారు గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన 15మీటర్ల దూరంలో పడిపోయింది. హరికృష్ణ దాదాపు 20మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలైన హరికృష్ణను 5నిమిషాల్లో నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రి తరలించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో హరికృష్ణ మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. సీటు బెల్టు ధరించకపోవడం, అతివేగమే ప్రమాదానికి కారణం. ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’  అని ఎస్పీ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు