ఉద్యోగం కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు.. | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో నెల్లూరు జిల్లా వాసి దుర్మరణం

Published Fri, Aug 2 2019 10:31 AM

A Nellore Man Who Died In A Train Accident - Sakshi

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): ఉద్యోగ నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లిన జిల్లా వాసిని రైలు రూపంలో మృత్యువు కబళించింది. కుమారుడు విగతజీవిగా మారడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. రాపూరుకు చెందిన బండి రవీంద్రరెడ్డి, విజయమ్మలకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు లోకేష్‌రెడ్డి (24) చిన్నతనం నుంచే కుటుంబ పరిస్థితులను దగ్గరగా చూశాడు. ఎలాగైనా ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. కష్టపడి చదివాడు. ఇంజినీరింగ్‌లో అత్యధిక మార్కులు సాధించి రైల్వే వికాస్‌నిగమ్‌లో సైట్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించాడు. దీంతో అతని కుటుంబం ఎంతో సంతోషించింది. జూలై 4వ తేదీన లోకేష్‌రెడ్డి మహారాష్ట్రలోని సోలోపూర్‌ జిల్లా కురడివాడిలో ఉద్యోగంలో చేరాడు. ప్రతిరోజూ తల్లిదండ్రులకు, అన్నకు ఫోన్‌ చేసి మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో జూలై 30వ తేదీ విధి నిర్వహణలో ఉండగా షోలాపూరు నుంచి పూణే వెళ్లే మెమో రైలు అతడిని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కురుడివాడి పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని అక్కడి హాస్పిటల్‌ మార్చురీకి తరలించారు. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. గుండెలవిసేలా రోదించారు. బంధువులు హుటాహుటిన మహారాష్ట్రకు వెళ్లారు. మృతదేహానికి అక్కడి వైద్యులు శవపరీక్ష నిర్వహించి అప్పగించారు. లోకేష్‌రెడ్డి మృతదేహాన్ని గురువారం తెల్లవారుజామున రాపూరుకు తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. 

Advertisement
Advertisement