ఎంత దారుణమో! | Sakshi
Sakshi News home page

ఎంత దారుణమో!

Published Fri, Feb 9 2018 1:27 PM

new couple suicide in east godavari district - Sakshi

‘వ్యాపారంలో నష్టం వచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయాం.వాటి నుంచి ఇక బయటపడలేం. ఇక ఆత్మహత్యే శరణ్యం’ అనుకున్న ఆ జంట శీతలపానీయంలో విషం కలుపుకొని తాగింది. తమ కన్నబిడ్డను అనాథను చేసింది.

కారణాలు ఏమైనా సమస్యలతో సతమతమై ముగ్గురు తమ యువ జీవితాలకు అర్ధంతరంగా ముగింపు పలికారు. అప్పుల బాధ తట్టుకోలేక రాజమహేంద్రవరంలో యువ దంపతులు శీతలపానీయంలో విషం కలుపుకొని తనువు చాలించగా... చదువులో ఒత్తిడిని తట్టుకోలేక కాకినాడ రంగరాయ వైద్య కళాశాల విద్యార్థి హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువ దంపతుల ఆత్మహత్యతో తొమ్మిది నెలల చిన్నారి అనాథగా మిగిలాడు. వైద్య విద్యార్థి మృతితో కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

రాజమహేంద్రవరం క్రైం: అప్పుల బాధ తాళలేక ఓ యువజంట ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మ పేటకు చెందిన కునుకు బాలకృష్ణ(31), అతడి భార్య కునుకు శ్రీగంగ(26) శీతలపానీయంలో విషం కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండేళ్లక్రితం వివాహమైన బాలకృష్ణ , శ్రీగంగకు ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు. బాలకృష్ణ రాజమహేంద్రవరం, దానవాయి పేటలో వస్త్రదుకాణం నిర్వహిస్తుంటాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా వ్యాపారంలో సుమారు రూ.15 లక్షల వరకు నష్టం వచ్చింది. దీంతో పాటు ఇతడిపై ఓ వ్యక్తి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలకృష్ణ బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అన్నపూర్ణమ్మపేటలోని ఇంటికి చేరుకున్నాడు.

బాలకృష్ణ తల్లి వెంకటలక్ష్మి కుమారుడికి భోజనం పెట్టమని కోడలు శ్రీగంగకు తెలిపి బయటకు వెళ్లింది. అయితే భార్య, భర్తలు ఇంట్లో ఉండి తమ సమస్యలు చర్చించుకుని శీతలపానీయంలో విషం కలుపుకొని తాగి అపరస్మారక స్థితికి చేరుకున్నారు. గదిలో కొడుకు, కోడలు మాట్లాడుకుంటున్నారని అనుకున్న తల్లి వెంకటలక్ష్మి సాయంత్రం ఐదు గంటల సమయంలో గదిలో నుంచి బాలుడు ఏడుపు వినిపించడంతో తలుపులు బద్దలు గొట్టి లోపలికి ప్రవేశించే సరికి గదిలో విగతజీవులుగా ఉన్నారు. హుటాహుటిన ఇద్దరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. విషయం గోప్యంగా ఉంచాలని మొదట కుటుంబ సభ్యులు భావించి, ఎవరూ పోలీసులకు సమాచారం అందించలేదు. అయితే చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలకు పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్‌టౌన్‌ ఎస్సై రాజ శేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రుల మృతితో అనాథగా మారిన బాలుడు
తల్లిదండ్రులు ఒకేసారి మృతి చెందడంతో బాలకృష్ణ, శ్రీగంగలకు పుట్టిన తొమ్మిది నెలల బాలుడు అనాథగా మారాడు. ఇంకా లోకం తెలియని తల్లి పాలు విడువని బాలుడి అమాయకపు చూపులు చూపరులను కంటతడి పెట్టించాయి. బాలకృష్ణ, శ్రీగంగలకు చెందిన బంధువుల రోదనలతో అన్నపూర్ణమ్మ పేట శోక సంద్రమైంది.

Advertisement
Advertisement