ఆ జంట తప్పు చేసిందా? | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 28 2018 12:20 PM

New Twist in Lucknow Passport Case - Sakshi

లక్నో: తీవ్ర దుమారం రేపిన మతాంతర జంట పాస్‌పోర్ట్‌ వ్యవహారం మరో మలుపు తిరిగింది. అధికారుల విచారణలో ఆ జంట తప్పుడు డిక్లరేషన్‌ను సమర్పించినట్లు తేలింది. ఈ మేరకు నిఘా వర్గాలు దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడగా, ఒక్క పేజీతో కూడిన నివేదిక లక్నో పోలీసులకు చేరింది. మంగళవారం సాయంత్రం ఆ నివేదికను ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి అందజేసినట్లు అధికారులు చేశారు. దీంతో ఆ జంటపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.  

మొహమ్మద్ అనాస్ సిద్దిఖీ-తన్వీ సేథ్‌ దంపతులు పాస్‌పోర్ట్‌ల కోసం లక్నోలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాన్ని సంప్రదించటం, అక్కడి అధికారి వికాస్‌ మిశ్రా మతపరమైన వ్యాఖ్యలు చేసి దురుసుగా ప్రవర్తించినట్లు సదరు జంట ఆరోపించారు. ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని వికాస్‌ను గోరఖ్‌పూర్‌ బదిలీ చేయటం, ఆ మరుసటి రోజే ఆ జంటకు పాస్‌పోర్టులు ఇప్పించటం జరిగిపోయాయి. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. సుష్మా స్వరాజ్‌పై వ్యక్తిగత దూషణలు కూడా మొదలయ్యాయి. అటుపై పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌లో భాగంగా ఇంటెలిజెన్స్‌ వర్గాలు వారిచ్చిన డిక్లరేషన్‌ తప్పుల తడకగా తేల్చింది.

నివేదికలో ఏముందంటే... ‘వివాహ సర్టిఫికేట్‌లో తన్వీ పేరు సాదియా అనస్‌గా పొందుపరచబడి ఉంది. ఆమె నోయిడాలోని బీటీ గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పని చేస్తున్నారు. నోయిడా సెక్షన్‌ 76, జేఎం అర్చిట్‌ అపార్ట్‌మెంట్‌, బీ604లో ఆమె అద్దెకు నివసిస్తున్నారు. పాస్‌పోర్టు దరఖాస్తులో ఆమె ఆ అడ్రస్‌ పేర్కొనలేదు. పైగా ఆమె లక్నోలో నివసిస్తున్నట్లు అసలు అడ్రసే సమర్పించలేదు. ఏడాది నుంచి ఆమె నోయిడాలోనే ఉంటున్నారు’ అని నివేదిక పేర్కొంది. దీంతో వాళ్ల పాస్‌పోర్టులను రద్దు చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వారికి రూ. 5 వేలు జరిమానా విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Advertisement
Advertisement