అలీ బాబా.. డజను దొంగలు! | Sakshi
Sakshi News home page

అలీ బాబా.. డజను దొంగలు!

Published Wed, Jun 27 2018 1:47 AM

North Zone Police arrested 12 thieves - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇద్దరు ఘరానా దొంగలు.. మొదటి చోరుడి తల్లిదండ్రులు, అన్న, అక్క, చెల్లి.. రెండో దొంగ అక్క, తల్లి.. షెల్టర్‌ చూపించేందుకు కామన్‌ ఫ్రెండ్‌.. చోరీ సొత్తు కొనేందుకు ఇద్దరు రిసీవర్లు.. ఇలా ఏర్పడిన 12 మంది సభ్యుల ముఠా. పగలు రెక్కీ చేసి తాళం వేసున్న ఇళ్లను గుర్తించడం.. రాత్రికి కొల్లగొట్టడం.. ఈ ముఠా పని. ఇలా 2015 నుంచి రాష్ట్ర రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 34 దొంగతనాలు చేసింది.

ఆరు కేజీల బంగారం, 18 కేజీల వెండి సహా రూ.3 కోట్ల విలువైన సొత్తును ఎత్తుకుపోయింది. ఈ ఘరానా దొంగల ముఠాను నార్త్‌జోన్‌ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వీరి నుంచి ఐదు కేజీల బంగారం, 12.5 కేజీల వెండి సహా రూ.2 కోట్ల విలువైన సొత్తు రికవరీ చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు.

చిన్నప్పటినుంచే..
మౌలాలికి చెందిన మహ్మద్‌ సద్దాం అలీ అలియాస్‌ ఇమ్రాన్, మోక పోతురాజు ఒకే ఏరియాలో ఉండేవాళ్లు. చిన్న వయసులో ఓ చెరువులో ఈత కొట్టడానికి వెళ్లేటప్పుడు ఇరువురికీ పరిచయం ఏర్పడింది. సద్దాం అన్న అన్వర్‌ వెల్డింగ్‌ షాపులో కొన్నాళ్లు ఇద్దరూ పని చేశారు. ఆ ఆదాయంతో తృప్తి చెందక చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. 2010లో మైనర్లుగా ఉన్నప్పుడే చోరబాట పట్టారు. మల్కాజ్‌గిరి పోలీసుస్టేషన్‌ పరిధిలో 4 దొంగతనాలు చేసి జైలుకెళ్లారు.

2013, 2015, 2016ల్లోనూ మల్కాజ్‌గిరి, కీసరల్లో చోరీలు చేసి పోలీసులకు చిక్కారు. ఇక్కడ నిఘా పెరగడంతో గతేడాది వరంగల్‌కు మకాం మార్చారు. అక్కడి ఆజంజాహి మిల్స్‌ కాలనీ, పర్వతగిరి, సుబేదారీ, పర్కాల్, హన్మకొండ, కాకతీయ వర్సిటీ, జనగాంల్లో వరుసగా 12 నేరాలు చేసి పట్టుబడ్డారు. దొంగతనానికి వీరు ధనవంతుల కాలనీలనే ఎంచుకుంటారు. పగలు బైక్‌పై తిరుగుతూ తాళం వేసున్న ఇళ్లను గుర్తిస్తారు.

రాత్రికి అక్కడకు చేరుకుని వెనుక తలుపు లేదా కిటికీ పగులకొట్టి లోపలికి వెళతారు. ఒకరు కాపలా ఉండగా మరొకరు లోపలకు ప్రవేశించి ‘పని’పూర్తి చేస్తారు. సీసీ కెమెరాలు ఉంటే వాటి వైర్లు కత్తిరించడం లేదా డిజిటల్‌ వీడియో రికార్డర్‌ను ధ్వంసం చేయడం చేస్తుంటారు. ఒకే ప్రాంతంలో వరుసపెట్టి నేరాలు చేయాలని భావిస్తే అక్కడ ఓ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుంటారు.

చోరీ సొత్తు సొమ్ము చేసేది కుటుంబీకులే..
వీరిద్దరికీ కుటుంబీకుల పూర్తి ‘మద్దతు’ఉంది. చోరీ చేసి తీసుకువచ్చిన సొత్తును ఇమ్రాన్‌ తల్లి సలీమబేగం, తండ్రి ఖాసింఅలీ, అక్క ఆసియా, అన్న అన్వర్, చెల్లి నజియాబేగంతో పాటు పోతురాజు సోదరి మమత, అతడి తల్లి దాచిపెట్టడం, అదనుచూసి విక్రయించడం చేసేవారు. మల్కాజ్‌గిరి, కవాడిగూడ ప్రాంతాలకు చెందిన చంద్రకాంత్‌మోహితే, బాపుఆనంద్‌అర్జున్‌లకు చోరీ సొత్తు అమ్మి సొమ్ము చేసుకునేవారు.

ఇమ్రాన్, పోతురాజుల స్నేహితుడు మహ్మద్‌రుస్తుం తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసేవాడు. అమ్మిన సొత్తుతో సఫిల్‌గూడ ప్రాంతంలో ఆసియాబేగం పేరుతో ఓ సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్, నాలుగు ద్విచక్ర వాహనాలు ఖరీదు చేశారు. ఇంట్లోకి అవసరమైన గృహోపకరణాలు సమకూర్చుకున్నారు.


రూ.2 కోట్ల సొత్తు రికవరీ...
ఈ ముఠా కదలికలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ డీసీపీ బి.సుమతి బేగంపేట ఏసీపీ ఎస్‌.రంగారావు నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రేతిఫైల్‌ బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇమ్రాన్, పోతురాజులను ఈ బృందం అదుపులోకి తీసుకుంది. వీరి వేలిముద్రలను ‘పాపిల్లన్‌ సాఫ్ట్‌వేర్‌’లో పరిశీలించగా.. ఓయూ పరిధిలో ఓ నేరస్థలంలో దొరికిన వాటితో సరిపోలాయి.

లోతుగా విచారించగా.. 2015 నుంచి చేసిన 34 చోరీలతో పాటు సహకరిస్తున్న కుటుంబీకులు, రిసీవర్లు, షెల్టర్‌ ఇచ్చిన వ్యక్తి వివరాలు బయటపెట్టాడు. ప్రత్యేక బృందాలు పోతురాజు తల్లి మినహా మిగిలిన పది మందినీ పట్టుకున్నారు. 12 మందినీ అరెస్టు చేసి.. వీరి నుంచి ఐదు కేజీల బంగారు ఆభరణాలు, 12.5 కేజీల వెండి వస్తువులు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు, ఫ్లాట్‌ డాక్యుమెంట్లు రికవరీ చేశారు.

వీటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. మానసికంగా సమస్య ఎదుర్కొంటున్న మరో సోదరుడు షౌకత్‌అలీని ఇమ్రాన్‌ చోరీల కోసం ఉపయోగించుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి 34 కేసుల్లో షౌకత్‌ ప్రమేయం లేదని నిర్ధారించారు. ఈ ముఠాను పట్టుకున్న అధికారులకు పోలీసు కమిషనర్‌ ప్రత్యేక రివార్డులు అందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement