‘పొగ’బట్టిన మృత్యువు | Sakshi
Sakshi News home page

‘పొగ’బట్టిన మృత్యువు

Published Tue, Feb 27 2018 9:53 AM

One dead and two injured in road accident - Sakshi

సత్తుపల్లిరూరల్‌: రోడ్డుకు ఆనుకొని ఉన్న పొలాల్లో గడ్డికి నిప్పంటుకొని..మొత్తం పొగచూరి దారి కనిపించక మూడు లారీలు ఢీకొని ఒకరి ప్రాణాలు పోయిన దుర్ఘటన సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో సోమవారం ఉదయం 10:30 గంటలకు చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సత్తుపల్లి జేవీఆర్‌ ఓపెన్‌కాస్ట్‌ నుంచి బొగ్గు లోడుతో టిప్పర్‌ కొత్తగూడెం వెళ్తుండగా కిష్టారం బీఈడీ కళాశాల సమీపంలో గడ్డి కాలుతూ..పొగ కమ్ముకొని డ్రైవర్‌కు సరిగ్గా దారి కనిపించలేదు. అక్కడ ఆగి ఉన్న మరో లారీని..ఓవర్‌టేక్‌ చేసే సమయంలో ఎదురుగా కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వస్తున్న ఖాళీ బొగ్గు టిప్పర్‌ సమీపానికి రాగా..ఇద్దరు డ్రైవర్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇది జరిగిన కొద్ది క్షణాల్లోనే..పొగ కారణంగా రోడ్డుపై ఆగి ఉన్న ఈ రెండు టిప్పర్లను గుర్తించక కరీంనగర్‌ నుంచి కాకినాడకు గ్రానైట్‌ రాయితో వెళుతున్న లారీ అతివేగంగా వచ్చి ఖాళీ బొగ్గు టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ రెండు బండ్లు ముందు ఉన్న లారీని గుద్దుకున్నాయి. ఈ ప్రమాదంలో గ్రానైట్‌ రాయి మీదకు దూసుకొచ్చి క్యాబిన్‌ నుజ్జునుజ్జయి డ్రైవర్‌ సెల్వంరాజు(26) దుర్మరణం చెందాడు. మృతదేహం రెండు లారీల మధ్య ఇరుక్కుపోయింది. పెనుబల్లి మండలం ఉప్పలచెలకకు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ నాదెండ్ల శ్రీనివాసరావు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా..సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు. సత్తుపల్లి సీఐ ఎం.వెంకటనర్సయ్య, పెనుబల్లి ఎస్సై జి.నరేష్, పోలీస్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చెరుకొని ప్రమాద వివరాలను సేకరించారు. సీఐ ఫైరింజన్‌ను తెప్పించి రోడ్డు పక్కన పొలంమడుల్లో మంటలను ఆర్పించారు. మూడు లారీలు నడిరోడ్డు మీదే ఉండడంతో కిష్టారం నుంచి పెనుబల్లి మండలం లంకపల్లి వరకు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. పోలీసులు జేవీఆర్‌ ఓసీ నుంచి నుంచి రెండు క్రేన్‌లను తెప్పించి..ప్రమాదానికి గురైన మూడు లారీలను పక్కకు తొలగించాక వాహనాల  రాకపోకలు సాగాయి.

Advertisement
Advertisement