‘బిగ్‌బాస్‌’పై మరో పిటిషన్‌

16 Jul, 2019 13:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగులో రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని మూడో సీజన్లోకి అడుగిడుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’.కి ఆదిలోనే అవాంతరాలు ఏర్పడుతున్నాయి. షో ప్రసారం కాకముందే వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే ఈ షో నిర్వాహకులపై యాంకర్‌, జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రియాల్టీ షోపై మరో పిటిషన్‌ దాఖలైంది. షో హోస్ట్‌ నాగార్జునతో పాటు మరో 10 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిల్‌ దాఖలైంది. ఈ షోలో అభ్యంతరకర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని, అందుకే సినిమాలాగే ప్రతి ఎపిసోడ్‌ను సెన్సార్‌ చేసి ప్రసారం చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా రాత్రి 11 గంటల తర్వాతే బిగ్‌బాస్‌ 3 షో ప్రసారం చేయాలంటూ పిటిషినర్‌ కోరినట్లుగా తెలుస్తోంది. 

(చదవండి : గాయత్రీ గుప్తా ఫిర్యాదుపై దర్యాప్తు)

హైకోర్టును ఆశ్రయించిన ‘బిగ్‌బాస్‌’ టీం
బిగ్‌బాస్‌ షో కోఆర్డీనేషన్‌ టీం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ షోపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ‘బిగ్‌బాస్‌ 3’ పై బంజారాహిల్స్‌, రాయదుర్గం పోలీసు స్టేషన్‌లతో నమోదైన కేసులను వెంటనే కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొంది. కాగా బిగ్‌బాస్‌ టీం దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను అనుమతించొద్దంటూ జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా హైకోర్టు వద్ద నిరసనకు దిగారు.

మరిన్ని వార్తలు